ద్వివేది అంటే చంద్రబాబుకు ఎందుకంత మంట?: రెండేళ్ల తరువాత కూడా ఆయనే బాధితుడు
అమరావతి: గోపాలకృష్ణ ద్వివేదీ.. రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ప్రస్తుతం ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుసారి చర్చనీయాంశమౌతోంది. గ్రామం పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అపవాదును ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎదుర్కొంటోన్నారు. ద్వివేది అలసత్వం వల్లే ఎన్నికల జాబితా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని, ఫలితంగా 2019 నాటి ఓటర్ల లిస్ట్‌తోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తోందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ: ఆయన స్థానంలో..!

రెండేళ్ల కిందట చంద్రబాబు..
ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి తీవ్ర వ్యాఖ్యలను ద్వివేది ఎదుర్కొన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రధానాధికారిగా ద్వివేది పనిచేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అధికారిక సమీక్షలను నిర్వహించడానికి ద్వివేదీ ఏమాత్రం అంగీకరించలేదు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ద్వివేదీ ఒప్పుకోలేదు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎలాంటి నిర్టయాలు తీసుకోకూడదంటూ అప్పట్లో కరాఖండిగా తేల్చేశారు.

ద్వివేది కార్యాలయానికి వెళ్లి మరీ..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో మంత్రివర్గాన్ని సమావేశ పర్చడానికి, అధికారులతో సమీక్షలను నిర్వహించి.. నిర్ణయాలను తీసుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏ మాత్రం అంగీకరించబోవంటూ ద్వివేది ముక్కుసూటీగా తేల్చి చెప్పారు. దీనితో చంద్రబాబు ద్వివేది కార్యాలయానికి వెళ్లి మరీ.. ఆయనపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాను దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్‌నని, తనకు నిబంధనలు, మార్గదర్శకాలను నేర్పించవద్దంటూ చంద్రబాబు అప్పట్లో ద్వివేదిని హెచ్చరించారు.

ఇప్పుడు కూడా ఆయనే..
తాజాగా- పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో కూడా ద్వివేదినే బాధితుడు కావడం కాకతాళీయమే, ప్రస్తుతం ఆయన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి అందే ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ మొత్తం ఆయన చేతుల మీదుగా సాగాల్సి ఉంటుంది. ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.

అండగా ఐఎఎష్ అధికారుల సంఘం..
ఎన్నికల జాబితాను సిద్ధం చేయలేదనే కారణంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఆ ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ సిఫారసు చేశారు. దీనికి అనుగుణంగా జగన్ సర్కార్.. వారిద్దరినీ విధుల నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు తెలుస్తోంది. కాగా- పంచాతీయ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం-ప్రభుత్వం మధ్య బాధితులుగా మారిన ద్వివేది, గిరిజా శంకర్‌లకు ఐఎఎస్ అధికారుల సంఘం అండగా నిలుస్తోంది. వారిద్దరి తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఓ వినతిపత్రాన్ని అందజేస్తారని తెలుస్తోంది.