ఉదయగిరి కొండల్లో బంగారం, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు; జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం జరుపుతున్న సర్వేపైనే ఉంది. కేంద్రం ఉదయగిరి ప్రాంతంలో గత కొంత కాలంగా ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుంది. ఫైనల్ గా ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన కేంద్రం జరుపుతున్న పరిశీలనలతో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట పరిధిలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూములలో బంగారం, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొండపై అన్వేషణ సాగించి అనేక చోట్ల ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కొండలో ఎంతమేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ నిర్వహించి గత కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులను చేపడుతున్నారు.

ఇప్పటివరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాసాయిపేట కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ పనులను నిర్వహించి, 46 నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించింది. ఇదిలా ఉంటే సోమవారం హైదరాబాద్ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డ్రిల్లింగ్ చేస్తున్న ప్రాంతాలను పరిశీలించింది. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలను పంపి నిక్షేపాలకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
ఇక ఖనిజ నిక్షేపాల వార్తలతో స్థానిక ప్రజలు బంగారం, రాగి, వైట్ క్వార్ట్జ్ నిక్షేపాలు ఉంటే తమ ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి మెట్ట ప్రాంతం కావడంతో, నీటి సదుపాయం చాలా తక్కువగా ఉంటుంది. పంటలు ఎక్కువగా పండించడానికి అనుకూలంగా ఉండదు. ఈ క్రమంలో ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉదయగిరి ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.