వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత సీన్ లేదు: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం ప్రకటనలు ఒకలా...గణాంకాలు మరోలా!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ వన్ అని...పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు,పరిస్థితులు కల్పించడం వల్లే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే!...

ఇలా గత మూడేళ్లలో రాష్ట్రంలో దాదాపు రూ.15 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినట్లు ఎపి ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అయితే వాస్తవంగా లెక్కలు చూస్తే ఎపికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల విలువ దాదాపు రూ 81,000 కోట్లేనని తేలింది. అందులోనూ ఇప్పటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి దశలో ఉన్నవి కేవలం 109 సంస్థలేనని గణాంక నిపుణులు విశ్లేషించారు.

Government announcements on foreign investments to the State differs statistics

అసమగ్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు టిడిపి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మూడేళ్ల పాటు ప్రత్యేక పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఇక సిఎం చంద్రబాబు కూడా స్వయంగా తన బృందంతో కలసి అనేకసార్లు పెట్టుబడుల అన్వేషణ కోసమంటూ విదేశాలు వెళ్లి అక్కడ సదస్సులు, రోడ్‌ షోలలో సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు ఐటి మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా రాష్ట్రంలో గత మూడేళ్లలో దాదాపు రూ.15 లక్షల కోట్లు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారంటూ ఎపి ప్రభుత్వం పలు సందర్భాల్లో ప్రకటించింది. కాని వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు దాదాపు రూ 81,000 కోట్లేనని...అందులో కూడా నిజంగా పూర్తిస్థాయి ఉత్పత్తి దశలో ఉన్నవి 109 సంస్థలేనని గణాంక నిపుణులు చెబుతున్నారు.

2016 నుంచి పెట్టుబడుల కోసం సదస్సులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంవత్సరం రూ 3.04 లక్షల కోట్లుమేర విదేశీ పెట్టుబడులుకు సంబంధించి 281 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అవి పూర్తిస్థాయిలో అమలయితే దాదాపు 5.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రచారం చేసింది. అలాగే 2017లో 537 సంస్థలతో ఎంఒయులు కుదుర్చుకుంటే రూ 7.18 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని...2018 పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో 499 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా 1.90 లక్షల కోట్ల మేర పెట్టుబడులొచ్చాయని ప్రభుత్వం ప్రకటనలు చేసింది.

ఇలా ఈ మూడు సదస్సులతోపాటు విదేశాల్లో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కలిపి మొత్తం రూ.15.16 లక్షల కోట్లు పెట్టుబడులకుగాను 2,717 సంస్థలతో ఎంఒయులు కుదుర్చుకున్నామని ఎపి ప్రభుత్వం అధికారిక గణాంకాల్లో వెల్లడించింది. కాని వాస్తవంగా వచ్చిన పెట్టుబడులను, ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలను విశ్లేషించి చూస్తే ఎక్కడా పొంతన కుదరడం లేదు.

ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో రూ.8,580 కోట్లతో సెంబ్‌కార్ప్‌ గాయత్రి పవర్‌ లిమిటెడ్‌, విశాఖలో రూ 5,545 కోట్లతో హిందూజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ వంటి పలు సంస్థలు మాత్రమే చెప్పిన ప్రకారం ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నాయి. అవికాకుండా వివిధ దశల్లో పనులు ప్రారంభించిన సంస్థలు మరో 19 ఉన్నాయి. ఇక అనంతపురంలో రూ.13,500 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కియా మోటార్స్‌ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.

అలెక్ట్రానా, నిప్పాన్‌, ట్రినా సోలార్‌ వంటి సంస్థలకు ఇంకా స్థల కేటాయింపులే జరగలేదు. ఇక మిగిలిన సంస్థలకు సంబంధించి కొన్నింటికి శంకుస్థాపన చేయగా, మరికొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు 2,717 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, రూ.15 లక్షల కోట్లు పైగా పెట్టుబడు లొచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పాటు వాటిద్వారా దాదాపు 33 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది.

కానీ వాస్తవంగా ఇప్పటివరకు అనుమతుల నుంచి ఉత్పత్తి దశవరకు మొత్తం 132 సంస్థలు రూ 1.18 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టగా 2.45 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని అధికారులు అంటున్నారు. వాటిలోనూ అధికశాతం నెల వేతనాలు పొందుతున్నవారు కాకుండా రోజువారీ కూలి పొందుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ప్రచారం చేసిన దానిలో కేవలం 7 శాతం మాత్రమే పెట్టుబడులు, ఉపాధి లభించాయని గణాంకాలను బట్టి అర్ధం చేసుకోవచ్చని గణాంక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

English summary
Amaravathi:The AP Government has made announcements that investors have invested over Rs 15 lakh crore in the state over the past three years. However, in fact, the figures show that the value of investments so far to the AP is about Rs 81,000 crore only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X