సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ : ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న ఉన్న ప్రతి ఒక్కరు, ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. నేడు వైఎస్ఆర్ పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ ఆర్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల ప్రదాత, మహానేత అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జకీయా ఖానం డిమాండ్ చేశారు. పేదలకు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన గొప్ప నాయకుడు వైయస్సార్ అని కొనియాడిన శ్రీకాంత్ రెడ్డి భారతరత్నకు ఆయన అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. అపర భగీరథుడుగా సాగునీరు, తాగునీరు అందించడం కోసం నాడు ఆయన చేసిన కృషి చాలా గొప్పది అని పేర్కొన్నారు.

వైఎస్సార్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అని ఆయన కొనియాడారు . తండ్రి తరహాలోనే తనయుడి పాలన కొనసాగుతోందని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తండ్రి అకాల మరణం తర్వాత తనయుడు జగన్ ఏపీ ప్రజల సంక్షేమం తన భుజాల మీద వేసుకుని పాలన కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి నాయకుడి బాటలో మేము నడవడం గర్వంగా ఉందని ఆయన సీఎం జగన్ పనితీరును కొనియాడారు. ప్రజలకు సంక్షేమం అందించటంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారని పేర్కొన్నారు .
బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచి, పేదలకు అండగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇస్తే గౌరవప్రదంగానూ, సముచితంగానూ ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి, వైఎస్సార్ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు నివాళులర్పించారు.