ఢిల్లీ ప్రయాణంలో గవర్నర్ నరసింహన్;జిల్లాల బాటలో లోకేష్:ఎందుకంటే?....
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీల్లో ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవలి రాజకీయ పరిణామాల గురించి వారికి నివేదించనున్నట్లు తెలిసింది.
మరోవైపు ఎపి ఐటి శాఖా మంత్రి లోకేష్ కూడా మంగళవారం నుంచి జిల్లాల పర్యటనలు బయలుదేరివెళ్లనున్నారు. నేడు పంచాయతీ రాజ్ దినోత్సవం అయినందున తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ఈ వేడుకల్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి పాల్గోనున్నారు. ఆ తరువాత వరుసగా మూడు రోజుల్లో మరో మూడు జిల్లాల్లో లోకేష్ పర్యటిస్తారు.

గవర్నర్...ఢిల్లీ ప్రయాణం నేడు
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తాజా ఢిల్లీ ప్రయాణం గతంలో అన్ని ఢిల్లీ పర్యటనలకంటే భిన్నమైనది, ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించి గవర్నర్ గత పర్యటనలన్నింటికంటే ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. కారణం గతంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో పాలన, పరిస్థితుల గురించి కేవలం నివేదించడం మాత్రమే జరిగేది. కానీ ఈసారి గవర్నర్ ఢిల్లీ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల గురించి, ముఖ్యమంత్రుల గురించి అందించే నివేదికకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

అంత ప్రాధాన్యత...దేనికంటే
ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ దగ్గరవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ తాజా పర్యటన రాబోయే రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల పాలనావ్యవహారాలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తెలంగాణా సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఈ నెల 19 న గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సహజంగానే ఆ రాష్ట్రానికి,కెసిఆర్ తో ముడిపడివున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగడం సహజం.
గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయిన గవర్నర్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ, నిషేదం, ఆ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారని, అలాగే కెసిఆర్ ఇటీవల తెరమీదకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ అంశం గురించికూడా చర్చించారని సమాచారం
తెలంగాణాకు సంబంధించి ఆయా అంశాలపై గవర్నర్ తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర హోం మంత్రికి నివేదిస్తారు.


ఎపికి సంబంధించి...ఏం చెప్పొచ్చు
ఇక గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 22 వ తేదీ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని గేట్ వే హౌటల్లో సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో అనేక తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ఏపీకి హోదా, విభజన హామీలు, కేంద్రం వైఖరి మొదలుకొని తాజా ధర్నపోరాట దీక్షలో బాలకృష్ణ వ్యాఖ్యల వరకు వివిధ అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

టిడిపి...గవర్నర్...ఢిల్లీ
మరోవైపు టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ నరసింహన్ నివేదికలు పంపుతున్నారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. కేంద్రాన్ని తప్పుదోవ పట్టించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అనేది టిడిపి శ్రేణుల్లో నెలకొని ఉన్న నమ్మకం. అలాంటి తరుణంలో ఇటీవలే కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చంద్రబాబును కలవడం, ఆ తరువాత గవర్నర్ సమావేశం కావడం...ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలుదేరి వెళుతుండటం, అక్కడ ఈ సారి పర్యటనలో గవర్నర్ కేంద్ర ముఖ్యలకు ఇచ్చే నివేదిక ఎపికి సంబంధించి అత్యంత కీలకం కానుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎపి సిఎం చంద్రబాబుతో సహా టిడిపి ముఖ్యలపై కేంద్రం కేసులు పెట్టేందుకు సిద్దమవుతోందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఈ ఢిల్లీ ప్రయాణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు...లోకేష్ జిల్లాల బాట
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్ మంగళవారం నుంచి జిల్లాల బాట పడుతున్నారు. మొదటగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తరువాత ఈ నెల 25న శ్రీకాకుళం, 26న విజయనగరం, 27న విశాఖ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. అయితే హఠాత్తుగా లోకేష్ జిల్లాల పర్యటనకు సంసిద్దం అవడం వెనుక
టిడిపికి సంబంధించి ముఖ్యమైన వ్యూహమే ఉందంటున్నారు. ఎపిలోని టిడిపి ప్రభుత్వం ముఖ్యులపై కేంద్రం కేసుల దాడి మొదలు పెట్టనుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు, ప్రజలకు ఆయా చర్యలు, పూర్వపరాల గురించి సమాయాత్తం చేసేందుకు లోకేష్ ఈ జిల్లాల పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.