గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని వదిలిపెట్టని టీడీపీ; ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పై రగడ కొనసాగుతున్న తరుణంలో కూడా గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నాని నియోజకవర్గం కావడంతో కొడాలి నానిని టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అటు జగన్ సర్కార్ పై, పోలీసులపై కూడా మండిపడుతున్నారు.
సినిమా థియేటర్స్ ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్ కు లేదు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీకి చేరిన గుడివాడ క్యాసినో వ్యవహారం
కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్యాసినో నిర్వహించారు అన్న ఆరోపణలు వెల్లువగా మారడంతో, సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీని వేసి గుడివాడకు పంపించి, నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చేసుకొని ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. అంతటితో వదిలిపెట్టకుండా కేసును వ్యవహారంపై ఈడీ విచారణ జరగాలని, కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టిడిపి నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు .ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లారు.

ఈడీ దృష్టికి గుడివాడ క్యాసినో వ్యవహారం .. దర్యాప్తు చెయ్యాలన్న టీడీపీ
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టికి గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని తీసుకువెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు గుడివాడ క్యాసినో వ్యవహారంపై విచారణ జరిపించాలని ఈడీకి ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అధికారులను కలిసిన టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వారు ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

500 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని కి సంబంధించిన ఫంక్షన్ హాల్ లో అక్రమంగా క్యాసినో నిర్వహించారని పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నిర్ధారణ కమిటీ సాక్ష్యాలు సేకరించి ఓ నివేదికను సిద్ధం చేసిందని, దానిని ఈ రోజు తాము ఈడీకి అందించినట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 500 కోట్ల రూపాయల బెట్టింగ్, డ్రగ్స్, లిక్కర్, తదితర నిషేధిత వస్తువులతో క్యాసినో నిర్వహించినట్లుగా ఈడీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నామని వెల్లడించారు.

పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారన్న ఆలపాటి రాజా
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్యాసినో నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను కోరామని వెల్లడించారు. స్వయంగా మంత్రి కి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించారని నిజ నిర్ధారణ కోసం వెళ్లిన టీడీపీ, బీజేపీ నేతలను వైసిపి గూండాలు, పోలీసులు అడ్డుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ నేతల అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.

టీడీపీ ఫిర్యాదుతో ఈడీ చర్యలు తీసుకుంటుందా?
క్యాసినో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని టిడిపి నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి గుడివాడ క్యాసినో వ్యవహారంలో ఈడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ గుడివాడ క్యాసినో పై కేసులు నమోదు చేస్తుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది.