తిరుపతి విమానాశ్రయం, సిబ్బందికి నీరు నిలిపివేత: జీవీఎల్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తిరుపతి విమానాశ్రయంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్‌కు తాగునీరు నిలిపివేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానమంత్రికి దీనిపై పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై ఆయన స్పందించారు.

జ్యోతిరాదిత్య సింధియాకు జీవీఎల్ ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యే బీ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరాను నిలిపివేశారని పలువురు బీజేపీ ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. తిరుపతి విమానాశ్రయానికి తాగునీరు నిలిపివేయించిన ఘటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.తిరుపతి ఎయిర్‌పోర్టు ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరా నిలిపివేతపై లేఖ రాశారు. తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేతపై విచారణ చేపట్టాలని కోరిన జీవీఎల్ నరసింహరావు. ఈవారం ప్రారంభంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, విమానాశ్రయ సిబ్బంది నివాస గృహాలకు నీటి సరఫరాను అకస్మాత్తుగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు.
వైసీపీ నేతలు కక్షపూరితంగానే చేశారంటూ జీవీఎల్
జనవరి 10న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హఠాత్తుగా విమానాశ్రాయనికి నీటి సరఫరాను నిలిపి వేసిందన్నారు. అధికార వైసీపీ పార్టికి చెందిన కొంతమందికి విమానాశ్రయ ప్రవేశం నిరాకరించారు. ఆ తర్వాత రోజు క్వార్టర్లకు నీటి సరఫరాను నిలిపేశారు.ఈ ప్రతీకార ఆలోచనా రహిత చర్య తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
దీంతో క్వార్టర్స్‌లోని నివాస గృహాల్లోని కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. నివాస గృహాలకు వెళ్లే రోడ్లు అకస్మాత్తుగా తవ్వడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లతోపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని జీవీఎల్ లేఖలో వివరించారు. మరమ్మతుల వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నా.. ఈ వివరణ అవాస్తవమని జీవీఎల్ ఆరోపించారు. వైసీపీ స్థానిక నేతలు ప్రతీకార చర్యలు తీసుకునేందుకు నీటిని నిలిపివేశారన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి, స్వతంత్రంగా విచారణ జరిపించాలని లేఖలో వెల్లడించారు.
చర్యలు తీసుకుంటామంటూ జ్యోతిరాదిత్య సింధియా
ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయానమంత్రి జోక్యం చేసుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను పరిశీలిస్తామని, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగబోదని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టు ఘటనపై బీజేపీ నేతలు కేంద్రంలోని ఇతర పెద్దలకు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేత చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వకపోతే తాగునీరు నిలిపేసి టార్గెట్ చేస్తారా? అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా సదరు వైసీపీ నేత అభినయ్ రెడ్డి కానీ, ఆయన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.