• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్‌తో పోరాడినా.. జగన్‌తో ఓడినా: చంద్రబాబు చంద్రబాబే..! ఆయనొక తెలుగు పొలిటికల్ లైబ్రరీ ..!

|

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడంలో దిట్ట. ఎక్కడైనా తన స్థానం సుస్థిరం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కేంద్రంలో చక్రాలు తిప్పినా... స్వరాష్ట్రంలో ఓటములు చవిచూసినా తిరిగి అధికారం దక్కించుకోవడం, విలక్షణ రాజకీయం, ఆయన ప్రత్యేకత. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పొలిటికల్ బ్రైట్ కెరీర్ ఆయన సొంతం. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు తెలుగు రాజకీయ పరమపదసోపాన పఠంలో నిచ్చెనలు ఎక్కినా... అదే స్థాయిలో కిందపడినా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోగల నేర్పరి.

  #HappyBirthdayCBN: Chandrababu Naidu A Political Library

  ఎవరితోనూ ఆయన్ను పోల్చలేము. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే సీనియర్ పొలిటీషియన్‌గా నేడు 70వ ఏటాలోకి అడుగుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజకీయంగా పలుమార్లు గ్రహణం పట్టినా... తెలుగు రాజకీయాల్లో పౌర్ణమి చంద్రుడిలా వెలుగొందారు. చంద్రబాబు అంటే చంద్రబాబే.70 ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం రాజీపడని ఆయన రాజకీయపోరాట స్ఫూర్తిని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు.

  విద్యార్థి దశనుంచే..

  విద్యార్థి దశనుంచే..

  చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఒక సాధారణ రైతుకుటుంబంలో జన్మించిన చంద్రబాబు విద్యార్థి దశనుంచే సామాజిక స్పృహతో ఉండేవారు. ఎస్వీ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో సహచర విద్యార్థులతో కలిసి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో లీడర్‌గా ఎదిగారు. యూనివర్శిటీలోనే రాజకీయాలను మొదలుపెట్టిన చంద్రబాబు తన రాజకీయ గురువు రాజగోపాల్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన చంద్రబాబు 1978లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. యువజన కాంగ్రెస్‌లో వైయస్సార్, గులాంనబీ ఆజాద్ వంటి వారితో కలిసి పనిచేశారు. అంజయ్య కేబినెట్‌‌లో రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబు మంత్రులుగా ఉండేవారు.

  ఎన్టీఆర్ టీడీపీ స్థాపనతో చంద్రబాబు రాజకీయ జీవితం కొత్త టర్న్

  ఎన్టీఆర్ టీడీపీ స్థాపనతో చంద్రబాబు రాజకీయ జీవితం కొత్త టర్న్

  ఇక 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపనతో చంద్రబాబు రాజకీయ జీవితం కొత్త టర్న్ తీసుకుంది. అవసరమైతే తన మామ ఎన్టీఆర్‌పైనే పోటీచేస్తానంటూ కాంగ్రెస్ అధినేతల సమక్షంలో నాడు చంద్రబాబు సవాల్ చేశారు. కానీ ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబులోని అసలు పొలిటీషియన్ బయటకొచ్చాడు. ఎటువంటి డైలమా లేకుండా ఎన్టీఆర్‌ను ఒప్పించి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే టీడీపీలో జాతీయ రాజకీయాల్లో పర్వతనేని ఉప్పేంద్ర, రాష్ట్రరాజకీయాలు తోడల్లుడు దగ్గుబాటి ఎన్టీఆర్‌కు అండగా ఉండేవారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలోను ఎన్టీఆర్‌తో పాటు ఉప్పేంద్రది కీలక భూమిక.

   టీడీపీలో కీలకంగా మారిన చంద్రబాబు

  టీడీపీలో కీలకంగా మారిన చంద్రబాబు

  పార్టీలో కార్యకర్తలకు శిక్షణ, ఇతర నేతలకు దగ్గరవ్వటం, గండిపేట టీడీపీ కార్యాలయంలో సంస్కరణలు అంకితభావంతో పనిచేసే విధానాలు చంద్రబాబును ఎన్టీఆర్‌కు మరింత దగ్గర చేశాయి. నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ రాంలాల్ ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది. అయితే ఆరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జరిగిన పోరాటాన్ని చంద్రబాబు అవకాశంగా మలుచుకున్నారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ నేతలను ఒకే తాటిమీదకు తీసుకొచ్చి తమపోరాటానికి మద్దతు స్వీకరించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అందులో వెంకయ్యనాయుడులాంటి వారున్నారు. పోరాటంలో ఎన్టీఆర్ చంద్రబాబు టీమ్ గెలిచింది. ఇక నాటి నుండి చంద్రబాబు హవాకు పార్టీలో అడ్డులేకుండా పోయింది. ఎన్టీఆర్ తర్వాత పార్టీ నేతలను తనవైపు తిప్పుకోవడంలో వారు తనకు ఆకర్షితులయ్యేలా చెయ్యడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

  లక్ష్మీపార్వతి కబంద హస్తాల నుంచి పార్టీని కాపాడేందుకు

  లక్ష్మీపార్వతి కబంద హస్తాల నుంచి పార్టీని కాపాడేందుకు

  పార్టీ పదవుల్లోనే ఉంటూ క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం, ఏ ఎన్నికలు జరిగినా గెలుపే లక్ష్యంగా క్యాడర్‌ను సిద్ధం చేయడం ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటూ పర్యవేక్షణ చేయడం నాటి రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. నాడు పార్టీకి పునాదులుగా మారిన ఆ క్యాడరే నేటికీ టీడీపీని మోస్తున్న సైన్యంగా కొనసాగుతోంది. తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో చంద్రబాబు సైతం మంత్రిగా పనిచేశారు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ తర్వాత చంద్రబాబు పార్టీలో ఒక్కో అడుగు వ్యూహాత్మకంగా వేశారు. చివరకు పార్టీని లక్ష్మీపార్వతి కబందహస్తాల నుంచి కాపాడుకోవాలనే నినాదంతో లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా అందరిని ఒక్కచోటికి చేర్చారు చంద్రబాబు. చంద్రబాబు తన చాతుర్యంతో నందమూరి కుటుంబంలోని వారినిసైతం తనవైపు తిప్పుకున్నారు. పరోక్షంగా ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచారు. లక్ష్మీపార్వతిని దూరం పెట్టేందుకు ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. దీంతో లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఏర్పాటైన శిబిరం కాస్త ఎన్టీఆర్‌కు ప్రత్యర్థిగా మారింది.

   అలిపిరి ఘటన మార్చివేసిందా..?

  అలిపిరి ఘటన మార్చివేసిందా..?

  1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. వెన్నుపోటు పొడిచారనే మచ్చ తొలగించుకునేందుకు జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, వంటి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమించారు. జాతీయ రాజకీయాల్లోను కీలక పాత్ర పోషించారు. 1999నాటికి బీజీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చారు. వాజ్‌పేయికి అత్యంత ఇష్టుడిగా మారారు. స్పీకర్‌గా బాలయోగికి అవకాశం దక్కేలా చూశారు. కలాంను రాష్ట్రపతి చేయటంలో చంద్రబాబుది కీలక పాత్ర. 2003లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగింది.

  ఇది చంద్రబాబు రాజకీయ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. దానిద్వారా సానుభూతి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆరునెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవికోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. విద్యుత్ ధరలు, బషీర్‌బాగ్ కాల్పులు, అంగన్‌వాడీ మహిళలలపై గుర్రాలతో దాడులు చంద్రబాబు ఆశించిన సానుభూతిని తొక్కిపెట్టేశాయి. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యంత్రిగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. దాంతో చంద్రబాబు ప్రతిపక్షనేత పాత్రకు పరిమితం అయ్యారు.

   ఓవైపు కేసీఆర్..మరోవైపు జగన్‌తో పోరాటం

  ఓవైపు కేసీఆర్..మరోవైపు జగన్‌తో పోరాటం

  2009 ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పార్టీలను ఏకంచేసిన రాజశేఖర్ రెడ్డి చరిష్మా ముందు మహాకూటమి కుదేలైంది. కొత్తగా పార్టీ పెట్టి చిరంజీవి సైతం 18 సీట్లకే పరిమితమయ్యారు. వైయస్ ఆకస్మిక మరణం తర్వాత సమైక్య ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో తన సహచరుడు తాను మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్టీ వీడిన కేసీఆర్ దెబ్బతిన్న బెబ్బులిలా చెలరేగారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు . చంద్రబాబు ఎదుర్కొన్న రాజకీయ సంకట పరిస్థితుల్లో ఇది మరోకీలక అంశం.

  సరిగ్గా అదే సమయంలో వైయస్ తనయుడు జగన్ జనంలోకి చొచ్చుకొచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలుపుకునేందుకు తొలినుంచి ప్రజల్లోనే నిలిచారు. అనేక కారణాలతో కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో నాడు తన సహచరుడు వైయస్‌తో పోరాడిన చంద్రబాబు... ఆ తర్వాత ఆయన తనయుడు జగన్‌తో రాజకీయంగా పోరాడాల్సి వచ్చింది. దీంతో జాతీయనాయకుడిగా, ఏపీ నేతగా ఎదిగిన చంద్రబాబు రాష్ట్ర విభజనతో 13 జిల్లాల ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు వచ్చారు. ఆయన అనుభవం మీద ఆశలతో ప్రజలు గెలిపించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ మైత్రితో చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి నవ్యాంధ్ర తొలిముఖ్యమంత్రి అయ్యారు.

  చంద్రబాబు చంద్రబాబే.. ఆయనొక పొలిటికల్ లైబ్రరీ

  చంద్రబాబు చంద్రబాబే.. ఆయనొక పొలిటికల్ లైబ్రరీ

  2014 నుంచి 2019 వరకు సాగిన చంద్రబాబు పాలన గతంకంటే చాలా భిన్నంగా సాగింది. అనేక కారణాలు ఆయనపై విమర్శలు, ఆరోపణలకు అవకాశం ఇచ్చాయి. కచ్చితంగా తానే తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో ఉన్న చంద్రబాబు తీసుకున్న కొన్ని రాజకీయ తప్పుడు నిర్ణయాలు 2019 ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేశాయి. తన సహచరుడు వైయస్ కుమారుడు జగన్ సీఎం కాగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు 23 సీట్లు మాత్రమే గెల్చుకుని ప్రతిపక్షనేతగా మిగిలారు. అదే సమయంలో ప్రధాని మోడీకి దూరమయ్యారు. ఇక టీడీపీ పని అయిపోయిందనే వాదనలు మొదలయ్యాయి. కానీ చివరి నిమిషం వరకు పోరాడే తత్వం ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ రాజకీయంగా తిరిగి నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారు.

  రాజకీయ వ్యూహాలలో సాటిలేని చంద్రబాబు కొత్తగా పాలనా పగ్గాలు పట్టిన జగన్‌కు ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏడుపదుల వయసులోకి వెళ్లినా రాజకీయంగా అదే వ్యూహం అదే పదును. నిరంతర ఆశావాది అయిన చంద్రబాబు తెలుగు రాజకీయాల్లో ఒక పొలిటిలక్ లైబ్రరీగా చెప్పుకోవచ్చు. అందుకే ఏది ఏమైనా చంద్రబాబు చంద్రబాబే..!

  English summary
  AP former Chief Minister and TDP President Chandrababu is celebrating his 70st birthday. Wishes are pouring in for this leader from all sections.Chandrababu served as CM in the Undivided AP for about 9 years and was the first CM of the bifurcated AP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more