ఇన్సైడర్పై హైకోర్టు తీర్పుతో మారిన లెక్కలు- ఎన్వీరమణకూ ఊరట- తదుపరి అస్త్రం ఇదేనా ?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో చోటు చేసుకుందని ఆరోపించిన ఇన్సైడర్ ట్రేడింగ్ తేలిపోవడం ఏపీలో చాలా లెక్కలను మార్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కళంకితులుగా ఉన్న టీడీపీ నేతలందరికీ హైకోర్టు తీర్పు భారీ ఊరటనిస్తోంది. వారితో పాటు తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలతో ఇరుకునపడ్డ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు కూడా ఈ తీర్పు ఊరటగా మారబోతోంది. అంతిమంగా వైసీపీ సర్కారుకు మాత్రం భారీ షాక్‌గా మిగిలిపోనుంది. దీనిపై ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో వైసీపీ సర్కారు కొట్టుమిట్టాడుతోంది. దీంతో చివరి అస్త్రంగా ఇక దాన్నే నమ్ముకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది.
అమరావతిపై జగన్ సర్కారుకు భారీ షాక్- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులన్నీ కొట్టేసిన హైకోర్టు

ఇన్సైడర్ ట్రేడింగ్ కాదన్న హైకోర్టు
ఎక్కడో స్టాక్ మార్కెట్లకు, సెక్యూరిటీలకు వర్తించే ఇన్సైడర్ ట్రేడింగ్ పదాన్ని తీసుకొచ్చి అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారానికి లింక్ చేస్తూ వైసీపీ చేసిన ఆరోపణలు హైకోర్టు తీర్పుతో పస లేనివిగా మారిపోయాయి. ప్రైవేటు లావాదేవీల్ని నేరంగా పరిగణించలేమన్న హైకోర్టు, అమ్మిన భూములకు రేట్లు పెరిగినప్పుడల్లా ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసులు నమోదు చేస్తామంటే ఎలా అని వైసీపీ సర్కారును ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా అక్కడ రాజధాని వస్తుందని ప్రపంచమంతటికీ తెలుసంటూ మరో బాంబు పేల్చింది. దీంతో ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పే కాదు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

హైకోర్టు తీర్పుతో మారనున్న లెక్కలు
అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఇన్నాళ్లూ ఆరోపించిన వైసీపీ సర్కారుకు హైకోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. హైకోర్టు తీర్పుతో వైసీపీకే కాదు రాష్ట్ర రాజకీయాల్లో పలు లెక్కలు మారిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమరావతిలో అక్రమాలను పదేపదే ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తు కోరిన వైసీపీ సర్కారుకు ఇప్పుడు కేంద్రం వద్ద ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్దితి. అలాగే గత ఎన్నికల్లో పరాభవం తర్వాత అమరావతి స్కాంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేతలకు ఇది భారీ ఊరట కలిగించింది. అలాగే వైసీపీ సర్కారు అక్రమాల పేరు చెప్పి రాజధాని అమరావతిపై చేసిన వాదనకూ కాలం చెల్లింది. అంతిమంగా మూడు రాజధానుల వ్యవహారానికి వైసీపీ చెప్తున్న ఓ కారణం హైకోర్టు తీర్పుతో కనుమరుగైంది. దీంతో విపక్షాలకూ ఇక అమరావతి విషయంలో స్వరం పెంచేందుకు అవకాశం దక్కింది.

జస్టిస్ ఎన్వీ రమణకు లైన్ క్లియర్
అమరావతిలో తన కుటుంబ సభ్యులు కొన్న భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకే వస్తాయంటూ ఏపీ సర్కార్ ఏసీబీతో కేసులు పెట్టించింది. ఇప్పుడు ఈ వ్యవహారానికి ఐపీసీ సెక్షన్లే వర్తించవని, అదసలు ఇన్సైడర్ ట్రేడింగే కాదంటూ హైకోర్టు తేల్చేయడంతో సర్కారు వాదన పసలేనిదిగా తేలిపోయింది. ఏసీబీ కేసులు కొట్టేయకపోయినా ఇన్సైడర్ ట్రేడింగ్‌లో సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టేయడం జస్టిస్ ఎన్వీ రమణకు భారీ ఊరటగా మారింది. అంతే కాదు మరో మూడు నెలల్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న రమణకు హైకోర్టు తీర్పు లైన్ క్లియర్ చేసిందని చెప్పవచ్చు.

ఇన్సైడర్ తీర్పుపై సుప్రీంలో వైసీపీ సవాల్ ?
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలన్నీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కనమరుగుకావడంతో ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జస్టిస్ ఎన్వీ రమణపై కోపంతో ఆయన కుటుంబ సభ్యులపై ఏసీబీ కేసులు నమోదు చేసిన వైసీపీ.. తాజా హైకోర్టు తీర్పుతో ఆయనకు ఊరట దక్కడంతో దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. జస్టిస్ రమణపై ఏకంగా ఛీఫ్ జస్టిస్‌కే ఫిర్యాదు చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించడాన్ని జీర్ణించుకుంటారా లేక సుప్రీంను ఆశ్రయించి న్యాయం కోరతారా అన్నది త్వరలో తేలనుంది.

వైసీపీకి మిగిలిన అస్త్రం అదే
అమరావతి భూముల వ్యవహారంలోఇన్సైడర్ ట్రేడింగ్ వాదనను హైకోర్టు తోసిపుచ్చడంతో తదుపరి అస్త్రంగా వైసీపీ మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే బినామీల వ్యవహారం. తెల్ల రేషన్ కార్డులు కలిగిన దాదాపు 800 మంది అమరావతిలో కోట్ల రూపాయల భూములు కొన్నారు. వీరందరినీ ముందుపెట్టి టీడీపీ నేతలే వీటిని కొన్నారనేది వైసీపీ ఆరోపణ. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిరూపణ కాకపోవడంతో ఈ బినామీల దందాపై వైసీపీ దృష్టిపెట్టవచ్చని తెలుస్తోంది. కచ్చితంగా ఈ తెల్ల రేషన్ కార్డు దారులంతా ఏదో ఒక టీడీపీ నేత బినామీయే అన్నది వైసీపీ అనుమానం. దీంతో ఇక బినామీలను నిరూపించడం ద్వారా అమరావతిపై వైసీపీ సర్కారు ఉచ్చుబిగించే అవకాశముంది.