నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి హార్డ్ స్ట్రోక్-అపోలో ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్ధతకు గురయ్యారు. ఆయనకు ఇవాళ గుండెనొప్పి రావడంతో వెంటనే అప్రమత్తమై అపోలో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చురుగ్గా ఉంటారని పేరున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 47 రోజులుగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్ధానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.దీంతో ఆయనకు గుండెలో స్పలంగా నొప్పిగా ఉన్నట్లు తెలియడంతో కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు అపోలో ఆస్పత్రిలో ఉంచిన కోటంరెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. వారితో పాటు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ ముఖ్యనేతలు కూడా ఆస్పత్రికి వస్తున్నారు. కోటంరెడ్డికి మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
దీంతో కోటంరెడ్డి ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కూడా ఆశించిన కోటంరెడ్డి.. అది కాస్తా రాకపోయే సరికి కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అయినా గడప గడప కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సమయంలో గుండెనొప్పి రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.