24 మంది మృతి -17 మంది గల్లంతు : 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం : రెస్క్యూ చర్యలు కొనసాగింపు..!!
భారీ వర్షాలు..వరదలతో నాలుగు జిల్లాలు భారీగా దెబ్బ తిన్నాయి. చిత్తూరు..కడప జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే సమయంలో కలెక్టర్లు జిల్లాల వారీగా జరిగిన ప్రాణ..పంట నష్ట వివరాల ప్రాధమిక అంచనాలను అందించారు. ముందుగా సహాయక చర్యల పైన ఫోకస్ చేయాలని సీఎం ఆదేశించారు. వదరల కారణంగా మరణించిన వారికి అయిదు లక్షల రూపాయాల పరిహారం ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. ఇదే సమయంలో నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది.

కడపలో ఎక్కువగా ప్రాణ నష్టం
ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో 4, అనంత, నెల్లూరుల్లో చెరొకరు గల్లంతైనట్టు వెల్లడించింది. మొత్తంగా 1316 గ్రామాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా అపార నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగాఅంచనా వేశారు.

పంట నష్టం అపారం
5.83లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 49వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. కడప జిల్లాలో 3,60,197, అనంతలో 2,30,322, నెల్లూరులో 29,981, చిత్తూరులో 12,237 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. ఈ నాలుగు జిల్లాల్లో 172 మండలాల్లోని నాలుగు నగరాలు, 1,316 గ్రామాలపై వాయుగుండం ప్రభావం చూపిందని గుర్తించారు. రూ.5.02 కోట్ల విలువైన 1,549 గృహాలు దెబ్బతిన్నాయని, రూ.2.31 కోట్ల విలువైన 612 పశువులు, 1,791 చిన్న జీవాలు, 3,232 కోళ్లు మృత్యువాతపడ్డాయని నిర్ధారించారు.

సహాయ చర్యల కోసం నిధులు విడుదల
సహాయ చర్యల కోసం కడప జిల్లాకు రూ.2.5 కోట్లు, చిత్తూరుకు రూ.2కోట్లు, నెల్లూరుకు రూ.కోటిన్నర, అనంతకు రూ.కోటి విడుదల చేశారు. మొత్తం 243 శిబిరాలు ఏర్పాటు చేసి, వాటిలోకి 20,923 మందిని తరలించారు. ముంపులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లే వ్యక్తిలకు రూ.వెయ్యి, కుటుంబానికైతే రూ.2వేలు తక్షణ సాయంగా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, ఈ నాలుగు జిల్లాల్లోని పలు ప్రాజెక్టులు..బ్రడ్జిలు కొట్టుకుపోయాయి. నదులు..వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజంపేట మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు అయ్యారు.

ఇంకా వరద నీటిలోనే పలు గ్రామాలు
కడప జిల్లాలోనే ఎక్కవ ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. కడప - అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతూ..వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరద తీవ్రత తగ్గిన తరువాత నష్టం అంచానల పైన అధికారులు ఫోకస్ పెట్టనున్నారు. అయితే, ఇంకా వదర కొనసాగుతుండటంతో గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.