ఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి .నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగింది. వర్షాలు, వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది .
వర్ష బీభత్సంతో విషాదం: వరదలో 30మంది గల్లంతు .. పాతబస్తీలో 9 మంది మృతి

ఏపీలో జోరువానలు .. కృష్ణానదికి వరద ఉధృతి
విపరీతంగా కురుస్తున్న వర్షాలు, గాలుల ధాటికి సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది . వర్ష బీభత్సానికి కోస్తాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ఇక వరదల కారణంగా కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతుంది . ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. నిన్న రాత్రే 5 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్ కు చేరటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .

సీఎం జగన్ కు లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీలో కొనసాగుతున్న వరద బీభత్సం పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. వర్షాల దెబ్బకు ఏపీలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన నష్టాన్ని అంచనా వేయడానికి చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.

రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ అధినేత
వర్షాల కారణంగా తడిసి దెబ్బతిన్న పంట ఉత్పత్తులు రంగు మారినప్పటికీ, కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు .నష్టపోయిన కౌలు రైతులను గుర్తించాలని, వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు ఎరువులు ఉచితంగా పంపిణీ చేసి ప్రభుత్వం రైతులకు బాసటగా ఉండాలని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచన
వరదల కారణంగా కూలిపోయి, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను, చేతివృత్తుల కుటుంబాలను ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.వర్షాల కారణంగా కొట్టుకుపోయిన రహదారులను పునరుద్ధరించాలని, వాగులు, వంకలకు పడిన గండ్లను పూడ్చాలని యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని,కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనిచంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.