
భీమవరానికి రఘురామ : ఎందుకంత ఆందోళన - చర్యలు తీసుకోండి : హైకోర్టు ఆదేశం..!!
వైసీపీ ఎంపీ రఘురామ చాలా రోజుల తరువాత తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రధాని మోదీ రేపు ( 4వ తేదీ) భీమవరంలో పర్యటనకు రానున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణతో పాటుగా సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి స్థానిక ఎంపీగా తాను హాజరవ్వాలని రఘురామ భావించారు. కానీ, గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో భీమవరం రావటానికి ఆందోళన చెందుతున్నారు. దీంతో.ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఈనెల 4న భీమవరంలో తన హెలికాప్టర్ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో అత్యవసరంగా (హౌజ్ మోషన్) వ్యాజ్యం వేశారు. దీని పైన కోర్టు విచారించింది.

భద్రత పైన రఘురామ ఆందోళన
హెలికాప్టర్ దిగేందుకు భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, దిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మొదట ఆమోదం తెలిపినా తర్వాత వెనక్కి తీసుకుందని గుర్తు చేసింది. అయితే హెలికాప్టర్ దిగేందుకు అనుమతిచ్చేలా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఎంపీ రఘురామ పర్యటన సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచినందున రాష్ట్ర పోలీసులూ రక్షణ ఇవ్వాలంటూ ఆదేశించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

ఎందుకంత ఆందోళన అంటూ కోర్టు ప్రశ్న
ఇక, రఘురామ తరపు న్యాయవాది తన వాదనల్లో భాగంగా.. రఘురామకు భీమవరం వెళ్లేందుకు హెలికాప్టర్ సాధ్యం కాని పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని నివేదించారు. అదే సమయంలో వైసీపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో పాటుగా ఘర్షణలు సృష్టించి పిటిషనర్‌పై తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర పోలీసులతో భద్రత కల్పించాలని కోరారు.

ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు
దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారంటూ ప్రశ్నించారు. తమ ఆందోళనలో అర్దం ఉందని..రక్షణ కల్పించేలా పోలీసు శాఖను అదేశించాలంటూ రఘురామ తరపు న్యాయవాది కోరారు. దీంతో..న్యాయమూర్తి ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసారు. కాగా, ఇప్పుడు ప్రధాని పర్యటన సమయంలో రఘురామ భీమవరం కు రావటం.. అదే సభలో సీఎం జగన్ తో సహా పలువురు ప్రముఖులు హాజరు కానుండటంతో ఈ సభా నిర్వహణ ఆసక్తి కరంగా మారుతోంది.