అమరావతిలో జగన్ సర్కారుకు మరో ఝలక్- ఆ కేసులూ కొట్టేసిన హైకోర్టు- రైతులకు ఊరట
అమరావతి రాజధాని వ్యవహారాల్లో వరుసగా రెండోరోజూ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన రైతులపై పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసుల విషయంలో హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టిన హైకోర్టు వాటిని కొట్టేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అన్నదాతల విషయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
టీమిండియాకు జగన్ కంగ్రాట్స్- మూడు దశాబ్దాల తర్వాత గబ్బా కోట బద్దలయిందంటూ..

అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు
అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడాన్ని నిరసిస్తూ ఏడాదిగా స్ధానిక రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. పలుమార్లు స్దానిక ప్రజాప్రతినిధులను కూడా అడ్డుకున్నారు. రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధుల వద్ద నిరసన తెలిపారు. దీంతో స్ధానికంగా ఉన్న దళిత ప్రజాప్రతినిధులను అడ్డగించడం, నిరసన తెలిపడంపై ఆగ్రహంతో పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిపై విపక్షాలతో పాటు రైతు కుటుంబాలు విమర్శలు గుప్పించినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.

అట్రాసిటీ కేసులపై హైకోర్టుకు రైతులు
తమపై ఏపీ పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసుల్ని కొట్టేయాలంటూ అమరావతిలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రైతులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఇవాళ మరోసారి విచారణ నిర్వహించిన హైకోర్టు.. రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టింది. రైతుల తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు హైకోర్టులో వాదనలు వినిపించారు. రైతులు చట్టబద్ధంగా నిరసన తెలిపితే అట్రాసిటీ కేసులతో ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడంపైనా అభ్యంతరం తెలిపారు. దీంతో హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎస్సీ రైతులపై అట్రాసిటీ సెక్షన్లు కొట్టేసిన హైకోర్టు
కృష్ణాయపాలెంలో రైతులపై గతంలో పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత వీటిని కొట్టేస్త్తూ తీర్పునిచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులను నివారించే లక్ష్యంతో తీసుకొచ్చిన చట్టం ప్రకారం అదే ఎస్సీలపై కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. చివరికి ఎస్సీ రైతులపై పోలీసులు పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను కొట్టేస్తూ ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇన్నాళ్లూ ఈ కేసులను సమర్ధించుకున్న పోలీసులు, ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

అమరావతిపై వరుస ఎదురుదెబ్బలు
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, దీని వల్ల విపక్ష టీడీపీకి చెందిన కీలక నేతలు లబ్ది పొందారని గతంలో ఆరోపణలు చేసి సీఐడీ కేసులు పెట్టిన వైసీపీ సర్కారుకు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై రాష్ట్రంలో చర్చ కొనసాగుతుండగానే ఇవాళ కృష్ణాయపాలెంలో ఎస్సీ రైతులపై పెట్టిన కేసులను సైతం హైకోర్టు కొట్టేయడంతో అమరావతిలో వైసీపీ సర్కారుకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అలాగే అమరావతిలో వైసీపీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు ఈ పరిణామాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.