మందడంలో హై టెన్షన్, రోడ్లపై రైతుల టెంట్లు, ఏ క్షణమైనా పోలీసులు తీసే ఛాన్స్, టెన్షన్, టెన్షన్..
మరికొన్ని గంటల్లో ఏపీ క్యాబినెట్ సమావేశం జరనుండగా అమరావతిలోని మందడంలో హైటెన్షన్ నెలకొంది. రాజధాని తరలింపును ఇక్కడి రైతులు నిరసిస్తూ ఉదయం 7 గంటల నుంచి ఆందోళన చేపడుతున్నారు. మందడం రహదారి నుంచే సచివాలయానికి వెళ్లాల్సి ఉంటోంది. ఈ క్రమంలో రైతులు టెంట్లు వేసుకొని ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టెంట్లు వేసి..
ఉదయం నుంచి టెంట్లు తీసేయాలని పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో రాత్రి టెంట్లు తీసేయాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజధాని తరలింపునకు అనుకూలంగా కామెంట్ చేయడం హైటెన్షన్ క్రియేట్ చేసింది. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో రైతులు ఆందోళన మరింత తీవ్రతరమైంది.

మంత్రివర్గ సమావేశం..
శుక్రవారం ఉదయం క్యాబినెట్ సమావేశం ఉండటంతో పోలీసులు మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాలపై ఫోకస్ చేశారు. దారిలో అడ్డుగా ఉన్న మందడం రైతులను పోలీసు స్టేషన్‌కు తరలించాలనే ఆలోచనలో ఉన్నారు. రోడ్డుపై ఉన్న టెంట్లను తీసేయాలని సూచించారు. కానీ వారు అందుకు నిరాకరించడంతో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా మారింది.

రోడ్డుపైనే జాగారం..
గురువారం రాత్రి రోడ్డుపైనే ఉండాలని గ్రామస్తుల నిర్ణయం తీసుకున్నారు. టెంట్లు తీయబోమని పోలీసులకు తెగేసి చెప్పారు. దీంతో టెంట్లను తీసేసి, రైతులను పోలీసు స్టేషన్ తరలించాలని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి అక్కడినుంచి టెంట్లు తీసేసే అవకాశం కనిపిస్తోంది.

కీ డెసిషన్..
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారబోతున్న విశాఖపట్టణానికి 394.50 కోట్లు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఏడు జీవోలు విడుదల చేసింది. అమరావతి రాజధాని మార్చొద్దని రాజధాని రైతులు కోరుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.