
చంద్రబాబు, కేసీఆర్ కంటే ఆయనేమన్నా గొప్పవాడా ఏమిటి?
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కంటే ఆయనేమన్నా గొప్పవాడా ఏమిటి? రాజకీయంగా వారిద్దరూ వేసిన ఎత్తులు ఆయన వేయగలడా? ఇద్దరూ రాజకీయంలో చాణక్యం నిరూపించుకున్నవారే. వారిద్దరూ వేసే ఎత్తులకు ప్రత్యర్థులు చిత్తు అవ్వాల్సిందే. అంతటి గొప్ప రాజకీయాలు నడిపిన ఈ ఇద్దరు నేతలు తమ బలాలను మరిచిపోయారా? ఎవరో కొత్తగా వచ్చిన వ్యూహకర్తలు తమకంటే గొప్పవారనుకుంటున్నారా? ఏమిటి? అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రం నిస్సందేహంగా వారిద్దరి ఎత్తులు, వారిద్దరి చాణక్యమే గొప్పదంటున్నారు. ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్తది చాలా చిన్నస్థాయి అని అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యేలను తరలించడంలో కీలకపాత్ర
తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించి రిసార్టుల్లో ఉంచి వారిని జాగ్రత్తగా కాపాడటం అనేది భారత రాజకీయాల్లో కొత్తగా వెలుగు చూసిన అంశం. ఆ తర్వాత వారిని జాగ్రత్తగా హైదరాబాద్ తరలించి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. ఈ విధానాన్ని తాజాగా మహారాష్ట్ర శివసేనలోని ఏక్నాథ్ షిండే వరకు అందరూ అవలంబిస్తున్నారంటే ఎంతగా విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చు. మరి రాజకీయం కన్నా పరిపాలన సరిగా చేయలేదా? అంటే మన కళ్లముందే హైదరాబాద్ కనపడుతోంది. పునాదులు వేసిన అమరావతి కనపడుతోంది.

రాష్ట్రాన్ని సాధించిన బక్కపలుచని వ్యక్తి
తెలంగాణ రాష్ట్రం రాదు.. ఉద్యమం నీరు కారిపోయింది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా ఉద్యమించి ఊరూవాడా తిరిగిన ఒక బక్కపలుచని వ్యక్తి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడు. దశాబ్దాల తరబడి ఉద్యమించిన మహా మహా నేతలవల్లే కానిది ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర్రావువల్ల అయింది. ఆ తర్వాత పరిపాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్న విషయం మన కళ్లముందే కనపడుతున్న వాస్తవం.

ఇద్దరూ నైతిక విలువలు పాటించారు
రాజకీయంగా ఈ ఇద్దరు నేతలు ఎప్పుడూ కుటిల నీతికి పాల్పడలేదు. కుటిల వ్యూహాలు అమలుపరచలేదు. నైతిక విలువలు పాటించారు. కానీ ఎక్కడో రెండు మూడు రాష్ట్రాల్లో కుటిల వ్యూహాలు అమలుచేసి, ప్రజల మధ్య కులాలు, మతాల చిచ్చు పెట్టి, తనకు భారీ ప్యాకేజీ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్తకు డిమాండ్ పెరిగిపోయింది. నైతికంగా చూస్తే ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. దేశంలో రాజకీయ వ్యూహకర్తలుగా పార్టీలకు ప్రణాళికలు అందించడం అనేది ఇప్పుడు ఫ్యాషనై పోయింది.

వీరిద్దరూ నిస్సందేహంగా గొప్పవారు
2019 ఎన్నికల్లో తమకు పనిచేయాల్సిందిగా చంద్రబాబు పీకేను కోరారు. కుదరకపోవడంతో ఆయన జగన్‌కు చేశారు. ప్రస్తుతం రాబిన్‌శర్మ టీడీపీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఇష్టం లేకపోయినప్పటికీ కేటీఆర్ ఒత్తిడి మేరకు పీకేను వ్యూహకర్తగా నియమించుకున్నారు. కానీ పీకే బలాబలాలకన్నా చంద్రబాబు, కేసీఆర్ బలాలు ఎక్కువ.. వ్యూహాలు అద్భుతం.. వారిని వారు నమ్ముకొని, వారిమీద ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందుకు వెళితే మరోసారి అధికారం దక్కించుకోవడమనేది వారికి పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినపడుతోంది.
కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఏపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్ర ఎన్నికలతోపాటు ప్రధానమంత్రిగా మోడీని ప్రమోట్ చేయడం విజయవంతం కావడంతో ఆయనకు డిమాండ్ ఎక్కువైంది. కాకపోతే ఒక్కసారి చంద్రబాబునాయుడు, కేసీఆర్ తమ వ్యూహాలకు పదును పెట్టాలని పీకేలు, గీకేలు తమకన్నా ఎక్కువ కాదనే విషయం తెలియజేయాలని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.