వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైరల్ ఫీవర్ మరణాలు: మంత్రినని మర్చిపోయి కామినేని వింత వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. కొండల్లోకి, గుట్ట ప్రాంతాల్లోకి రోడ్లు వేయడం ఎలా అన్న వింత ప్రశ్నను సంధించారాయన.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: అధికారంలో ఉన్న వారికి లోకమంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కొండల్లో, గుట్టల మధ్య నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించే వారంటే అధికార పార్టీ నేతలకు కష్టంగానే ఉంటుంది. తరాలుగా కొండల్లోనే జీవిస్తున్న గిరిజనులు ప్రతియేటా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పుడల్లా వైరల్ జ్వరాలతో అంటువ్యాధులతో మంచాన పడుతున్నారు.

ఇప్పుడంటే టీవీ చానెళ్లు, వార్తా పత్రికలు అందుబాటులోకి రావడంతో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెలుగు చూస్తున్నది. సకాలంలో ఆసుపత్రికి వెళ్తే అనేక ప్రాణాలను దక్కించుకోవచ్చు. ప్రతి కుటుంబానికీ తమ కుటుంబ సభ్యులే ముఖ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. కొండల్లోకి, గుట్ట ప్రాంతాల్లోకి రోడ్లు వేయడం ఎలా అన్న వింత ప్రశ్నను సంధించారాయన.

తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాపరాయిలో 16 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ కొండల్లోకి రోడ్లు, నీటి వసతులు కల్పించడం ఎలా అని ప్రశ్నిస్తూనే చాపరాయిలో జ్వరాలతో ఎవరూ చనిపోలేదని తనదైన శైలిలో మంత్రి కామినేని శ్రీనివాస్ భాష్యం చెప్పారు. కలుషిత నీరు, మూడ నమ్మకాలతోనే వారు చనిపోయారని తేల్చేశారు. తాను ఒక మంత్రినన్న సంగతి విస్మరించి మరీ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో గిరిజన గ్రామాలకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ అంగీకరించడం గమనార్హం.

అంటు వ్యాధుల మరణాలపై ఇలా కామినేని

అంటు వ్యాధుల మరణాలపై ఇలా కామినేని

‘తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని చాపరాయిలో దాదాపు 60 కుటుంబాలున్నాయి. వారంతా ఎక్కడో కొండల్లో దూరంగా ఉంటున్నారు. వాళ్ల కోసం నీళ్లు, రోడ్లు, కరెంటు.. ఇలా అన్ని వసతులూ అందించాలంటే ఎలా?' అని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. ‘ఆ ఊళ్లో ఎవరూ జ్వరాలతో చనిపోలేదు. ఆవు మృతి చెందడంతో.. ఆ కళేబరం నుంచి వచ్చిన నీళ్లు తాగడం, చేతబడి వంటి మూఢనమ్మకాల వల్లే చనిపోయారు. అంతేగానీ మలేరియా జ్వరాలతో కాదు. ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసు మాత్రమే నమోదైంది..' అంటూ వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో రొటేషన్‌ ప్రాతిపదికన వైద్యుల్ని నియమిస్తామన్నారు.

జ్వరాల భారీన 16 కుటుంబాలు

జ్వరాల భారీన 16 కుటుంబాలు

చాపరాయిలో 16 మంది గిరిజనుల మరణం ఘటన మరువక ముందే అక్కడకు చేరువలోని గొందికోటజ్వరాలకు కేంద్రంగా మారి ఓ బాలుడ్ని బలి తీసుకున్నది. తూర్పుమన్యంలోని ఈ గ్రామంలో 16 కుటుంబాలు, 78 మంది జనాభా ఉన్నారు. 16 కుటుంబాల్లో సరాసరిన ఇంటికి ఇద్దరు చొప్పున, కొన్ని కుటుంబాలు పూర్తిగా జ్వర పీడితులుగానే ఉన్నారు. తల్లిదండ్రులు కూడా జ్వరాలతో బాధపడుతుండడంతో పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లలేని దుస్థితి నెలకొంది. అందువల్లే కడబాల అబ్బాయిరెడ్డి, మంగమ్మ దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడిని కోల్పోయారు. వీరి మరో నలుగురు సంతానం కూడా జ్వరాల బారీన పడ్డారు. ప్రస్తుతం గ్రామంలో 32 మంది జ్వర పీడితులు ఉన్నారు. అధికార యంత్రాంగం మొత్తం చాపరాయి గ్రామంలోనే ఉంది. గొందికోట గోడు పట్టించుకునేవారే లేరని వార్తలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఐటీడీఏ పీవో దినేశ్‌కుమార్‌ వైద్య బృందాలను పంపితే.. సాయంత్రం గొందికోటకు చేరుకుని జ్వర పీడితులందర్ని రంపచోడవరం ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు.

గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానిదే

గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానిదే

తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రపురం మండలం లక్ష్మినగరంలో మానె ఆదిలక్ష్మి (23) మలేరియాతో మరణించింది. కాగా, పాడేరు ప్రాంతంలో ఈనెల 10 నుంచి మంగళవారం వరకూ 103 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంపచోడవరం పరిధిలోని చింతూరు ప్రాంతంలో దేశంలోనే అత్యంత ఎక్కువ మలేరియా కేసులు నమోదయ్యే గ్రామాలున్నాయి. వాటిలో తులసిపాల మొదటి స్థానంలో ఉండగా, ఏడురాళ్లపల్లి, కుంటూరు, కూనవరంలలో పరిస్థితి అదుపుతప్పుతోంది. పార్వతీపురంలో జనవరి నుంచి ఇప్పటి వరకూ 986 మలేరియా కేసులు నమోదయ్యాయి. నిజానికి,మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి రోగాలు ప్రాణాంతకం కాదు. అవగాహన లేక గిరిజనులు జ్వరం వచ్చిన వెంటనే ఆకుపసర్లు తీసుకుంటారు. రోగికి వ్యాధి ఎక్కువగా ఉంటే ఏఎన్‌ఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)కు పంపిస్తారు. అక్కడ వైద్య సదుపాయాలు లేకపోతే స్థానిక ఏరియా ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడ కూడా సరైన వైద్యం అందకపోతే జిల్లా ఆస్పత్రికి వెళ్లాలి. గిరిజనులు మాత్రం ఏరియా ఆస్పత్రి దాటి వెళ్లడం లేదు. పట్టణాలకు వెళ్తే తమని పట్టించుకోరన్న అభద్రతని పోగొట్టగలిగితే వారి ఆరోగ్య పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు.

ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఇలా

ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఇలా

ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస మౌలిక వసతుల్లేవని, తక్షణమే వారికి తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం వంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని సీఎస్‌ దినేశ్‌కుమార్‌ అంగీకరించారు. గిరిజనుల మరణాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పనకు నెలలోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఐటీడీఏ పీవోలను ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, సంచార వైద్యశాలలు, మందులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందన్నారు. వివిధ నెట్‌వర్క్‌ ఏజెన్సీలతో మాట్లాడి పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ చెప్పారు.

English summary
East Godavari egency villages are struggling with malaria and other viral fevers. But AP Medical and Health Minister Kamineni Srinivas says differently that to be immposible facilitate infrastructure at hills and other agency villages while the chief secretary of Andhra Pradesh accepted there is no facilties at villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X