నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
ఏపీలో గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు తెలిసిన వారు రాష్ట్ర జనాభాలో ఒక్కశాతం కూడా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన పేరు తెలియని రాజకీయ పార్టీలు కానీ సాధారణ ప్రజలు కానీ అదే ఒక్క శాతానికి చేరిపోయినా ఆశ్చర్యం లేకపోవచ్చు. ఇదంతా సీఎం జగన్ పుణ్యమే అని చెప్పడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ రాజ్యాంగ సంస్ధకు అధిపతిగా తనపని తాను చేసుకుపోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో గతేడాది మార్చిలో పోరుకు తెరలేపిన సీఎం జగన్ ఇప్పుడు ఆయన చెప్పినట్లు పని చేసుకుపోతేనే మంచిదనే పరిస్ధితికి రావడం వెనుక కారణాలేంటి ?
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి

జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు
దాదాపు ఏడాది క్రితం అంటే గతేడాది ఫిబ్రవరిలో ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేష్ విడుదల చేశారు. అప్పట్లో ఎన్నికలకు వైసీపీకే కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా పెద్దగా అభ్యంతరాల్లేవు. కానీ నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియలో ఆధిపత్యం కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలు.. వెరసి జగన్ సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిపోయాయి. తొలుత అంతర్గతంగా సాగిన ఈ పోరు కొద్ది రోజుల వ్యవధిలోనే బయటపడిపోయింది. కరోనా పేరుతో స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంతో సీఎం జగన్ భగ్గుమన్నారు.
ఇక అప్పటి నుంచి దాదాపు ఏడాదిగా జరిగిన పరిణామాలు ఏపీ చరిత్రలోనే తొలిసారిగా నిలిచాయి.

నిమ్మగడ్డ వర్సెస్ జగన్ పోరు క్లైమాక్స్
ఏడాది కాలంగా నిమ్మగడ్డ విషయంలో సర్కారు వ్యవహారశైలి, ప్రభుత్వం విషయంలో నిమ్మగడ్డ వ్యవహారశైలి పక్కనబెడితే వీటన్నింటికీ మించిన ఉత్కంఠ రేపింది క్లైమాక్స్ మాత్రమే. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో ఎన్నికలకు సిద్దమైన నిమ్మగడ్డను ఎలా నిలువరించాలో తెలియక మల్లగుల్లాలు పడిన ప్రభుత్వం చివరికి వ్యాక్సినేషన్‌ను తెరపైకి తెచ్చింది. అయితే పరిమితంగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కానీ, షెడ్యూల్ కానీ ఎన్నికలకు ఆటంకం కాలేదు. దీంతో ఉద్యోగుల భయాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికలను వాయిదా కోరడం మొదలుపెట్టింది. మా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించలేమంటూ ఉద్యోగులతో చెప్పించింది. ఈ వాదనకు కోర్టులు అంగీకరిస్తాయో లేదో తెలియని పరిస్ధితి.

అదను చూసి దెబ్బకొట్టిన నిమ్మగడ్డ
సర్కారుతో ఏడాదిగా సాగుతున్న పోరు క్లైమాక్స్‌కు చేరగానే నిమ్మగడ్డ వ్యూహాలు మరింత పదునెక్కాయి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ టైమింగ్ ఎంతో ముఖ్యం. ఎంత బలం ఉందన్నది కాదు దాన్ని ఎప్పుడు వాడామన్నదే ముఖ్యం. ఈ సామెతను అక్షరాలా అమల్లో పెట్టిన నిమ్మగడ్డ రమేష్ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా లీడ్ తీసుకున్నారు. హైకోర్టు ఎప్పుడైతే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేయగానే గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు నిమ్మగడ్డ సిద్ధమైపోయారు. హైకోర్టు తీర్పును వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని తెలిసి కూడా ఒకేసారి నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు.

అదే టర్నింగ్ పాయింట్
ఎప్పుడైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించి దాఖలు చేసిన పిటిషన్లో తప్పులున్నాయని రిజిస్ట్రీ తిరస్కరించిందో అక్కడే నిమ్మగడ్డ సగం గెలిచేశారు. అదే ఊపుతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్దమవుతున్న నిమ్మగడ్డను అడ్డుకోలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అదే జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరుకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇప్పుడిక మిగిలింది సుప్రీంకోర్టు తీర్పుపై ఆశలే. సోమవారం నిమ్మగడ్డ వ్యవహారశైలిని సుప్రీంకోర్టులో సవాల్ చేసే క్రమంలో పిటిషన్లలో ప్రభుత్వం వాడిన భాష సమస్యను మరింత జటిలంగా మార్చింది. ఏకంగా సుప్రీంకోర్టుకు ఇందులో ఇగో రాజకీయం ఉందని అర్ధమయ్యేలా చేసింది. దీంతో సుప్రీంకోర్టులోనూ సర్కారుకు ఊరట దక్కకుండా పోయింది.

అన్ని ఎన్నికలకూ నిమ్మగడ్డ రెడీ
సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలపై ఇచ్చిన తీర్పు ఓ ఎత్తయితే తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. నిమ్మగడ్డ వర్సెస్ జగన్‌గా సాగుతున్న ఈ పోరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇగో రాజకీయాల్లో తమను లాగొద్దంటూ చురకలు అంటించింది. అంతే కాదు నిమ్మగడ్డపై ప్రభుత్వం వాడిన భాష రాజ్యాంగబద్దంగా లేదని చెప్పేసింది. దీంతో నిమ్మగడ్డను ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ ప్రతిబింబించింది. దీంతో పంచాయతీ ఎన్నికలే కాదు వీటి తర్వాత పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ నిర్వహించేందుకు నిమ్మగడ్డ రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చిలో తన పదవీకాలం ముగిసేలోపు అన్ని ఎన్నికలూ పూర్తి చేయాలన్న నిమ్మగడ్డ టార్గెట్ నెరవేరితే ఇక హాయిగా రిటైర్ అయిపోవచ్చనేది ఆయన ఆలోచన.