అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్
ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అనూహ్య దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం జగన్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో వారిలో 9 మందిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒకరోజు సస్పెండ్ చేశారు. అనంతరం వివరణ కొనసాగించిన సీఎం జగన్.. చివర్లో 'చంద్రబాబు పాట'ను ప్లే చేయించడంతో సభ ఘొల్లుమంది. జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా కడుపు పట్టుకుని పడి పడి నవ్వారు..
ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..
అసెంబ్లీలో చంద్రన్న పాట..
పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని సీఎం జగన్ అన్నారు. గతంలో పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం విమర్శించారు. చంద్రన్న భజన చేయడం కోసం ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టారని సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘జయము జయము చంద్రన్నా.. జయము నీకు చంద్రన్నా..'' అంటూ టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ పోలవరం ఎదుట పాటిన పాట తాలూకు వీడియోను జగన్ సభలో ప్లే చేయించారు. ఆ వీడియోను చూస్తూ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు పడిపడి నవ్వారు. అంతేకాదు..

ఇన్ని ఘోరాలు జరిగాయా?
‘జయము జయము చంద్రన్న' పాట వీడియో చూసి స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం పొట్టచెక్కలయ్యేలా ముసిముసి నవ్వులు నవ్వారు. నవ్వు ఆపుకోలేకపోయిన సీఎం జగన్ మధ్యలోనే ఆ వీడియోను ఆపేయించి.. అధ్యక్షా.. ఈ విధంగా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని సభ దృష్టికి తెచ్చారు. చంద్రన్న పాట వీడియో చూసిన స్పీకర్ తమ్మినేని.. అప్పట్లో ఇన్ని నేరాలు.. ఘోరాలు జరిగాయన్నమాట అంటూ ఘోల్లున నవ్వారు..

ఇంచు కూడా ఎత్తు తగ్గించం
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని, దివంగత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తులోనే కచ్చితంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపకూడదని తపనతో ముందుకెళుతున్నామని, ఆర్‌అండ్‌ఆర్‌పైన ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే..

2021 డిసెంబర్‌కే పోలవరం పూర్తి
సీఎం జగన్ కంటే ముందు పోలవరంపై మాట్లాడుతూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ కీలక ప్రకటన చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఏది ఏమైనా 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహానిస్తామన్నారు. ఇదే అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని, చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పట్టిసీమను తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. పోలవరంలో భాగం అయిన పట్టిసీమ కోసం అదనంగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. కాగా,

కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
అసెంబ్లీలో బుధవారం పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టిన ‘ఏపీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ థర్డ్ అమైన్మెంట్ బిల్లు', మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన ‘యానిమల్ ఫీడ్, క్వాలిటీ కంట్రోల్ బిల్లు'తోపాటు ‘ఏపీ స్టేట్ డెపలప్మెంట్ కార్పొరేషన్, వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల మార్పిడి) సవరణ బిల్లు-2020 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ (కన్వర్షన్ నాన్ అగ్రికల్చరల్ పర్పస్) అమెండ్మెంట్ బిల్లు''ను కూడా అసెంబ్లీ ఆమోదించింది. పోలవరంపై సీఎం జగన్ వివరణ అనంతరం శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి.