ఆరోగ్యంగానే ఉన్నా, ఆందోళన వద్దు: వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ ట్వీట్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటన వెల్లడించింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, కరోనావైరస్ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు.
వారందరికీ ధన్యవాదాలు..
ఈ సందర్భంగా తనను త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించిన అందరికీ వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వెంకయ్య నాయుడుకు కరోనా సోకిందని తెలియగానే దేశ వ్యాప్తంగా ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రులు, ముఖ్యమంత్రులు, లేజిస్లేచర్స్, స్నేహితులు, తోటి పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆందోళన వద్దు.. బాగానే ఉన్నా..
మాల్దీవుల ఉపరాష్ట్రపతి ఫైజల్ నసీం కూడా వెంకయ్యకు కరోనా సోకిందని తెలియగానే ఆవేదనకు గురైనట్లు తెలిపారు. వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు వెంకయ్యనాయుడు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెంకయ్య స్పష్టం చేశారు.
వెంకయ్యకు కరోనా పాజిటివ్.. ఆయన సతీమణికి నెగిటివ్..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడినట్లు సోవమారం రాత్రి ఆయన కార్యాలయం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ.. ఆయన హోంక్వారైంటైన్లో ఉంటున్నారని తెలిపింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించింది. వెంకయ్య సతీమణి ఉషా నాయుడుకు పరీక్ష నిర్వహించగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఆమె కూడా ఐసోలేషన్లో ఉన్నారు.

వెంకయ్య కోలుకోవాలంటూ పవన్ కళ్యాణ్
కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు త్వరగా కోరుకోవాలంటూ జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. మన భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండలవాడిని కోరుకుంటున్నాను'అని తెలిపారు. కాగా, ఇటీవలే కరోనా బారినపడి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పలువురు ఎంపీలు, ఓ కేంద్రమంత్రి కూడా మరణించారు.