AP Panchayat elections 2021 nimmagadda ramesh kumar amaravathi srikakulam tdp ysrcp అమరావతి శ్రీకాకుళం టీడీపీ వైఎస్సార్సీపీ politics
అందుకే కోర్టుకు: తనపై వస్తున్న విమర్శలను సున్నితంగా తిప్పికొట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అధికార పక్షం నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మండిపడుతుంటే.. ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వైసీపీ నుంచి నేతలతోపాటు మంత్రులు కూడా విమర్శలు చేస్తుండటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నా పరిధి, బాధ్యత తెలుసు: నిమ్మగడ్డ రమేష్ కుమార్
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ కూడా వివాదాస్పదం కాలేదని అన్నారు. తన పరిధి, బాధ్యత తెలుసు అని, స్వీయ నియంత్రణ పాటిస్తానని అధికార వైసీపీ నేతలకు పరోక్షంగా జవాబిచ్చారు.

అందుకే కోర్టుకు..
ప్రతి వ్యవస్థకూ రాజ్యాంగం నిర్దిష్టమైన నిధులు కేటాయించిందని రమేష్ కుమార్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరని స్పష్టం చేశారు. బాధ్యతలు నిర్వర్తించేందుకే అధికారులు ఇచ్చారని, తమ విధుల్లో జోక్యం చేసుకున్నందుకే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నాపై కేసు: నిమ్మగడ్డ
ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకే నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని ఎస్ఈసీ చెప్పారు. బుధవారం యాప్ ఆవిష్కరించి దాని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమపై కేసు పెట్టారని రమేష్ కుమార్ తెలిపారు. తమ సామాగ్రిని తీసుకెళ్లి సిబ్బందిని భయపెట్టారని, బెదిరింపులకు భయపడితే వ్యవస్థ పలుచన అవుతుందన్నారు. మీ సంగతేంటో చూస్తామంటూ వ్యవహరించడం సరికాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హితవు పలికారు.

అలా చేస్తేనే సమస్యలు..
తాము ఏక్రగీవాలకు తాము పూర్తిగా వ్యతిరేకం కాదని, దానిపై తమకు నిర్దిష్ట అభిప్రాయముందన్నారు. శ్రీకాకుళంలో జిల్లాలో గతంలో 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తేనే సమస్యలొస్తాయన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే తాను జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు రమేష్ కుమార్ తెలిపారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది చేస్తున్నారంటూ నిమ్మగడ్డపై వైసీపీ నేతలు, మంత్రులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది.