andhra pradesh nimmagadda ramesh kumar nominations candidates ap high court ap govt ap news నామినేషన్లు
వైసీపీకి నిమ్మగడ్డ భారీ షాక్- మళ్లీ మున్సిపల్ నామినేషన్లు- సంశయలాభం, విశేషాధికారంతో
ఏపీలో రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న నిమ్మగడ్డ... గతంలో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన చోట అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎస్ఈసీగా తనకున్నవిశేషాధికారాలను ఆయన వాడబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఈసారి నామినేషన్ల ఉపసంహరణ నుంచి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

మున్సిపల్ పోరులో బలవంతపు ఉపసంహరణలు
ఏపీలో గతేడాది మార్చిలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోరులో పలు చోట్ల బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. దీని వల్ల పోటీకి అర్హులైన ఎంతో మంది అభ్యర్ధులు నామినేషన్లు కొనసాగించలేక పోరు నుంచి తప్పుకున్నారు. అధికార వైసీపీ బలవంతం కారణంగానే ఈ అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు కారణమైన అధికారుల బదిలీలకు కూడా ఆయన సిఫార్సు చేశారు. ఇప్పుడు తిరిగి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేఫథ్యంలో ఆ ఉపసంహరణల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

అభ్యర్ధుల నుంచి ఎస్ఈసీ ఫిర్యాదుల స్వీకరణ
గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అసాధారణ రీతిలో జరిగిన నామినేషన్ల ఉపసంహరణపై ఇప్పటికే నిమ్మగడ్డ దృష్టిపెట్టారు. ఇలాంటి బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీంతో అభ్యర్ధులు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ రేపటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాటిపై ఇప్పటివరకూ ఎస్ఈసీ ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ ఫిర్యాదులపై ఎస్ఈసీ ఏం చేయబోతుందన్న ఉత్కంఠ అభ్యర్ధుల్లో కొనసాగుతోంది.

తొలిసారి విశేషాధికారాలు ప్రయోగిస్తున్న నిమ్మగడ్డ
మున్సిపల్ ఎన్నికల పోరులో గతంలో నామినేషన్లు వేయలేకపోయిన వారు, వేసి కూడా బలవంతంగా ఉపసంహరించుకున్న వారికి న్యాయం చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి విషయంలో సానుకూలంగా ఉన్న నిమ్మగడ్డ వీరి కోసం తన అసాధారణ అధికారాలను ప్రయోగించేందుకు సైతం వెనుకాడబోరని తెలుస్తోంది. గతంలో అన్యాయం జరిగిన అభ్యర్ధుల విషయంలో తొలిసారిగా ఎస్ఈసీ విశేషాధికారాలను వాడబోతున్నట్లు నిమ్మగడ్డ సంకేతాలు ఇచ్చారు. దీంతో సదరు అభ్యర్ధుల్లనూ ఆశలు చిగురిస్తున్నాయి.

బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మరోసారి నామినేషన్లు
సాధారణంగా క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నిబంధన కింద ప్రత్యేక పరిస్ధితుల్లో అంపైర్లు తమ నిర్ణయాలను ప్రకటిస్తుంటారు. అక్కడి పరిస్ధితుల ఆధారంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ( సంశయ లాభం) కింద నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అభ్యర్ధులకు మేలు జరిగేలా తాను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని నిమ్మగడ్డ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీంతో అభ్యర్ధులు చేసిన అభ్యర్ధనలపై సానుకూల నిర్ణయం తీసుకుని, వారికి మరోసారి నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని నిమ్మగడ్డ తెలిపారు.

వైసీపీకి భారీ షాకిచ్చిన నిమ్మగడ్డ
గతంలో జరిగిన నామినేషన్ల ఉఫసంహరణ అంతా అధికార వైసీపీ కన్నుసన్నల్లోనే జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు అవే చోట్ల మరోసారి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం విశేషాధికారాలు ప్రయోగించేందుకు సిద్దమవుతున్నట్లు స్వయంగా నిమ్మగడ్డ చేసిన ప్రకటన ఇప్పుడు అధికార వైసీపీకి భారీ షాక్‌గా మారింది. అదే జరిగితే గతంలో తాము బలవంతంగా ఉపసంహరింపచేసిన నామినేషన్లు తిరిగి వేసేందుకు ప్రత్యర్ధులకు అవకాశం దొరుకుతుంది. ఇది అంతిమంగా వైసీపీకి పలుచోట్ల ఎదురుదెబ్బగా మారబోతోంది. తాజాగా మున్సిపల్ పోరులో తన నామినేషన్ అడ్డుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి లాంటి ఎందరికో ఈ నిర్ణయం మేలు చేయబోతోంది.