ఇరగదీస్తున్న రఘురామ-సాయిరెడ్డి ట్వీట్ వార్-కోడి పంచ్ కు కోడి కత్తి రిప్లై- అభిమానులకు పండగ
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసుకుని తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రారంభించిన ట్వీట్ వార్ పతాకస్ధాయికి చేరుకుంటోంది. సాయిరెడ్డి ట్వీట్లకు రఘురామకృష్ణంరాజు కూడా రెచ్చిపోతుండటంతో పంచ్ ల మీద పంచ్ లు పేలుతున్నాయి. ఇవి సహజంగానే అభిమానులకు పండగలా మారిపోతున్నాయి. వీరిద్దరి ట్వీట్ పంచ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సాయిరెడ్డి, రఘురామ పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఆ పార్టీకి దూరమై పోరు ప్రారంభించిన రఘురామపై అనర్హత వేయించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తనపై అనర్హత వేయించడం చేయకాకపోతే చెప్పండి తానే రాజీనామా చేసేస్తానంటూ రఘురామ ప్రారంభించిన మైండ్ గేమ్ ఇప్పుడు వైసీపీని తెగ ఇరిటేట్ చేస్తోంది. దీంతో రఘురామను టార్గెట్ చేసేందుకు సాయిరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ ముదిరిపోయింది. ఇప్పుడు అది కాస్తా పతాకస్ధాయికి చేరిపోతోంది.

పంచ్ లే పంచ్ లు
రఘురామను టార్గెట్ చేసుకుని సాయిరెడ్డి నిత్యం పెడుతున్న ట్వీట్లకు కౌంటర్లు కూడా అదే స్దాయిలో పడుతున్నాయి. అయినా సాయిరెడ్డి కానీ, రఘురామ కానీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సహజంగానే ప్రత్యర్ధులపై ట్వీట్లతో విరుచుకుపడటంలో ఆరితేరిన వీరిద్దరూ ఇప్పుడు పరస్పరం విసురుతున్న పంచ్ లతో ట్వీట్ వార్ పతాకస్ధాయికి చేరిపోతోంది. ఇందులో ఎన్నో విషయాలు చర్చకు వచ్చేస్తున్నాయి. ఈ ట్వీట్లు కూడా రోజురోజుకూ వాడీవేడిగా మారుతూ వీరిద్దరి అభిమానులకు పండగలా మారిపోతున్నాయి.

కోడిని కెలికిన సాయిరెడ్డి
"కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే" అంటూ విజయసాయిరెడ్డి రఘురామను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రఘురామను బాగా ఇరిటేట్ చేయడంతో ఆయన కూడా ఘాటుగా జవాబిచ్చారు.

కోడి కత్తితో రఘురామ జవాబు
సాయిరెడ్డి ట్వీట్ పై స్పందించిన రఘురామ ఆయన కోడి పంచ్ కు కోడి కత్తితో సమాధానం ఇచ్చారు. "కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? " అంటూ సాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ తర్వాత సాయిరెడ్డి మరో ట్వీట్ చేయలేదు.