• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీలో లుకలుకలు: ఎవరి దారి వారిదే.. పట్టుకోసం బాబు విఫలయత్నం

By Swetha Basvababu
|

హైదరాబాద్ / అమరావతి: అధికార రాజకీయాలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే తెలుగు తమ్ముళ్లు క్రమశిక్షణకు మారు పేరు. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగైనట్లు కనిపిస్తున్న వేళ.. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో ఒంటెద్దు పోకడలే అనుసరిస్తున్న సమయం.. అధికార టీడీపీలో క్రమంగా పెరిగిన దూకుడు.

పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా తానై వ్యవహరిస్తున్న వైనం.. జిల్లాల వారీగా పార్టీ నేతల మధ్య అనిశ్చితి, అభద్రతాభావం నెలకొల్పి.. వారిలో ఆశలు రేకెత్తించి తనకు అనుకూలంగా మార్చుకోవడం అందరికీ తెలిసిన సంగతేనని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల క్యాబినెట్ విస్తరణ సమయంలోనూ పార్టీలో తలెత్తిన అసమ్మతి, గ్రూప్ రాజకీయాలను తనదైన శైలిలో చల్లార్చేందుకు పూనుకున్నారు చంద్రబాబు. ఆ క్రమంలో అసమ్మతితో ఉన్న నేతలతో బుజ్జగింపుల రాజకీయం నెరిపారు. అందుకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావును మధ్యవర్తిగా వినియోగించారు.

రాష్ట్రంలోని అధికార పార్టీలో ఎక్కడ సమస్య తలెత్తినా గంటా శ్రీనివాస రావు వాలిపోవడం మధ్యవర్తిత్వం వహించడం ఆనవాయితీగా మారింది. ఎవరెళ్లినా తాను మీ వాడినని నమ్మబలుకుతున్న చంద్రబాబు మాటలతో ఉబ్బి తబ్బిబ్బయినా తెలుగు తమ్ముళ్లు తమ సొంత సమస్యలు ముందుకు వచ్చినప్పుడు మాత్రం తమలో అసమ్మతిని బయట పెడుతూనే ఉన్నారు. ఉత్తరాంధ్రలోని విజయ నగరం జిల్లా మొదలు విశాఖపట్నం నుంచి ఉభయ గోదావరి జిల్లాలు.. ప్రకాశం.. గుంటూరు జిల్లాల వరకు చివరకు సీఎం సొంత జిల్లా చిత్తూరులోనూ గ్రూప్ రాజకీయాలు మీడియా సాక్షిగా బయటపడ్డ సంగతి అందరికీ తెలిసిన సంగతే.

గంటా కేంద్రంగా ఎదురు దాడి వ్యూహం అమలు ఇలా

గంటా కేంద్రంగా ఎదురు దాడి వ్యూహం అమలు ఇలా

కానీ ఇటీవల విశాఖ పట్నం కేంద్రంగా బయటపడ్డ భూ భాగోతం రాష్ట్ర రాజకీయాలను కకావికలం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నుంచి జిల్లాలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని డమ్మీని చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విశాఖలో వందల ఎకరాల భూములు కబ్జా అవ్వడం, స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తదితర నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. ఈ కుంభకోణం మొత్తం సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో మంత్రి లోకేష్‌ సారథ్యంలోనే జరిగినట్లు విపక్షాలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు, అధికారులు దుయ్యబడుతున్నారు. విశాఖ జిల్లాకే చెందిన సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలోనే ఈ భూముల కబ్జాపై వాస్తవాలు బయట పెట్టడంతో అసలు కథ మొదలైంది. భీమునిపట్నంతో సహా విశాఖలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని అయ్యన్న పాత్రుడు కుండబద్దలు కొట్టారు. ఈ భూ భాగోతంపై రెవెన్యూ, పోలీసు శాఖలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.

భూ దందా వెనుక మంత్రి లోకేశ్?

భూ దందా వెనుక మంత్రి లోకేశ్?

విశాఖ భూభాగోతంలో దర్యాప్తు పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ముందు చూపుతో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే అయ్యన్నపాత్రుడి వ్యవహార శైలిపై ఆయన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు ఘాటు లేఖ రాయడం వెనుక సాక్షాత్ సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నదని వార్తలొస్తున్నాయి. అసలు దీనికి వెనుక భవిష్యత్ పార్టీ సారధిగా భావిస్తున్న లోకేశ్ కు ఈ భూ దందాతో సంబంధాలు ఉండటమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. తనయుడ్ని కాపాడుకునేందుకే నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి.. గంటాతో లేఖాస్త్రం సంధించేలా చేశారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గంటా టీడీపీ నుంచి టీడీపీలోకి ఇలా

గంటా టీడీపీ నుంచి టీడీపీలోకి ఇలా

సొంత ప్రయోజనాల కోసం పార్టీ నేతల భవిష్యత్‌ను ఫణంగా పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడరన్న విమర్శ ఉన్నది. కొడుకు లోకేశ్ బాబును మంత్రిని చేసేందుకు జరిపిన మంత్రివర్గ విస్తరణలో సొంత జిల్లా చిత్తూరుకు చెందిన సీనియర్ నేత బొజ్జల గోపాలక్రుష్ణారెడ్డిని పక్కకు తప్పించడానికి వెనుకాడలేదు. తీరా అసంత్రుప్తి వ్యక్తం చేసిన బొజ్జల వద్దకు పంపిన మధ్యవర్తుల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. కాకపోతే అప్పట్లో బొజ్జల సతీమణి గంటా శ్రీనివాసరావుపై నిప్పులు చెరిగారని మీడియాలో వార్తలొచ్చాయి. అది వేరే సంగతి. ఆ మాటకు వస్తే గంటా శ్రీనివాసరావు 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది.. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా... 2014 వరకు కొనసాగి ఎన్నికల ముందు టీడీపీలోకి తిరిగి వచ్చిన నేపథ్యం గంటాది. అదే గంటా ఇప్పుడు విశాఖపట్నం మొదలు విజయనగరం జిల్లాలోనూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. నేరుగా అశోక్ గజపతి రాజును లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి విషమిస్తుందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆయన అనుచరులను తప్పించడానికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.

ధీటుగా అశోక్ ప్రతి వ్యూహం

ధీటుగా అశోక్ ప్రతి వ్యూహం

విజయనగరం జిల్లా ఇన్ చార్జి మంత్రిగా గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా టీడీపీలో మంట పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత పార్టీ నాయకత్వం కూడా శత్రుచర్ల విజయ రామరాజుకు, తర్వాత సుజయకృష్ణ రంగారావుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడేమో అశోక్‌ అనుంగు శిష్యులను తప్పించేందుకు పూనుకుంటున్నది. ఈ విషయంలో అశోక్ గజపతి రాజు సూచనలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆయన కూడా పరిస్థితిని గమనించి వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారని సమాచారం. అధిష్టానం వ్యూహాలకు దీటుగానే అశోక్‌ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తన మాటే చెల్లుబాటు కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధి ష్టానం ఏం చేస్తుందో చూద్దామనే ధోరణిలో ఉన్నారు. మినీ మహానాడుకు హాజరు కాకపోవడం వెనక ఇదే కారణమని తెలుస్తోంది. తనకున్న విలువేంటో ఈ దెబ్బతో తేలిపోతుందని భావిస్తున్నట్టు తెలిసింది. తనను కాదని చేసే పరిస్థితి ఇక్కడ లేదన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం. అందుకు భిన్నంగా జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని, ముందుంది మొసళ్ల పండగ అని అశోక్‌తో పాటు ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

అద్దంకిలో వేలు పెట్టొద్దన్న చంద్రబాబు

అద్దంకిలో వేలు పెట్టొద్దన్న చంద్రబాబు

ఒకే జిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాలు, గ్రూపులను తనదైన శైలిలో ఐక్యంగా ముందుకు తీసుకెళ్తామన్న సంకేతాలివ్వడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాటి లేదు. ప్రకాశం, కర్నూల్ జిల్లాల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరే దీనికి నిదర్శనం. ప్రకాశం జిల్లాలో 1978 నుంచి గొట్టిపాటి హన్మంతరావు, కరణం బలరామక్రుష్ణమూర్తిలకు ఒకరంటే ఒకరికి పడదు. 1985 ఎన్నికల తర్వాత వారిద్దరూ చెరో పార్టీలో కొనసాగే పరిస్థితి నెలకొంది. 1996 లోక్ సభ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒకరిని లోక్ సభకు, మరొకరికి అసెంబ్లీకి పంపి అసమ్మతిని చల్లార్చేవారు. మంత్రిగా గొట్టిపాటి హన్మంతరావు మరణం తర్వాత ఏకఛత్రాధిపత్యం వహించొచ్చని కలలు కన్న కరణం కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. గొట్టిపాటి రవికుమార్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ 2014లో టీడీపీ గెలుపొందడంతో సైకిలెక్కేశారు. కానీ కరణంతో తంటా వచ్చింది. ఇది పాత కక్షలు తిరిగి తలెత్తడానికి దారి తీసింది. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని కరణం బలరామక్రుష్ణమూర్తిని పిలిపించి అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ అప్పటికే కరణం పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.

కర్నూల్ జిల్లాపై పట్టుకు శిల్పా ఇలా

కర్నూల్ జిల్లాపై పట్టుకు శిల్పా ఇలా

ఇక రాజకీయంగా చైతన్యం గల జిల్లాల్లో కర్నూల్ ఒకటి. 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం గల జిల్లాలో తర్వాత పరిస్థితి మారిపోయింది. తాజాగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి పోలింగ్ కు ముందే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి హాఠాన్మరణం.. ఇటీవలే నంద్యాల నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి మరణించారు. శోభానాగిరెడ్డి స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ఆమె తనయ అఖిల ప్రియ.. తండ్రితో కలిసి సైకిలెక్కేశారు. కానీ దురద్రుష్టం వెన్నాడటంతో ఆమె తండ్రినీ కోల్పోయారు. దరిమిలా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కింది. దీంతో ప్రత్యర్థి గ్రూపుగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి రగిలిపోయారు. కానీ నంద్యాల సీటు దక్కుతుందేమోనన్న ఆశ పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అడియాసలు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గమ్మత్తేమిటంటే భూమా కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగింది. కానీ తర్వాతీ కాలంలో సమీకరణాల్లో మార్పుల కారణంగా 2009 ఎన్నికల నాటికి బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయింది. అయితే ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సూక్తిని తన విషయంలో పాటిస్తూ వచ్చే చంద్రబాబు ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా విబేదాలున్నా.. కలిసి పని చేయాలని సూచించడం కొసమెరుపు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP minister Ganta Srinivas Rao fired on his ministerial collegue Ayyanna Patrudu who revealed Land grabbing Vishakapatnam District. Recently Ayyanna patrudu alleged that minister and other TDP MLA's were actively involved in land grabbing while some allegations here that Nara Lokesh who is also minister in Chandrababu and his son behind this land grabbing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more