ఏపీలో కాంగ్రెస్ మనుగడ సాధ్యమేనా..?
ఏపీలో కాంగ్రేస్ పార్టీ కదలికలు కనుమరుగయ్యాయి.రాష్ట్ర విభజన అంశం శరాఘాతంలా పరిణమించి కాగ్రేస్ హేమాహేమీలను కోలుకోని దెబ్బతీసింది. కాంగ్రేస్ మనుగడ మాట పక్కనపెడితే అసలు పార్టీని నడిపించే సాహసం చేయలేక సైలెంట్ గా ఉండిపోతున్నారు మిగిలిన నేతలు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రేస్ పార్టీ ఉనికి ఆంద్ర ప్రదేశ్ లో ప్రశ్నార్థకం కానుందా..? అపార రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రేస్ దిగ్గజాలు పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమిస్తారా..? లేక విభజన చిచ్చుకు పార్టీని ఆజ్యంగా ఉపయోగిస్తారా...? అంటే సమాధానం మాత్రం కనుచూపుమేర కనిపించడం లేదు. ఆంద్ర ప్రదేశ్ లో కాంగ్రేస్ పార్టీని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆ పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకునే సాహసం చేయలేకపోతోంది.విభజన వల్ల తలెత్తే సమస్యలను ఖచ్చితంగా అంచనా వేయలేక,సున్నితమైన సమస్య ప్రజల మనోభావాలను ఏమేరకు దెబ్బతీసాయో గుర్తించలేక బొక్కబోర్లా పడిన కాంగ్రేస్ ఇంతవకూ కోలుకోలేకపోయింది.

కాంగ్రేస్ పార్టీకి తగిలిన విభజన గాయం మానేదాప్పుడు..
తీవ్ర నైరాశ్యంలో ఉన్న కాగ్రేస్., టీడిపి ప్రభుత్వ పరిపాలనలో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం కూడా చేయలేక పోతోంది.175 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేక పోయిందంటే ప్రజాగ్రహానికి కాంగ్రేస్ ఎంతమేరకు బలైపోయిందో అర్థం చేసుకోవచ్చు.ప్రభుత్వం పనితీరును ప్రశ్నించాలా..? లేక పార్టీని ప్రక్షాళన చేసుకోవాలా అన్న మీమాంసతో కాలం వెళ్లదీస్తున్నట్టు కనిపిస్తోంది కాంగ్రేస్. ఇక పార్టీకి వెన్నంటే ఉండే సీనియర్ నేతలు, అదిష్టానానికి అత్యంత ఆప్తులు ఇప్పుడు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఏపి కాంగ్రేస్ మరింత కష్టాలపాలైంది. పార్టీలో తమ పరిస్థితి ఏంటో తమకే అర్థం కాని కొందరు నేతలు పార్టీ అదికారిక కార్యక్రమాలకు సైతం హాజరు కాక పోవడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా ప్రజా క్షత్రంలోకి వెళ్లే కార్యక్రమాలకు రూకల్పన చేసులేకపోవడం పార్టీ దయనీయ పరిస్థితిని తెలియజేస్తుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

కకావికలమైన హేమాహేమీలు.. గట్టెక్కించే నాయకుడు ఎవరు..
పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఎపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామంటున్నారు రఘువీరా. ఆంద్ర ప్రదేశ్ లో నేతల మద్య ఏకాభిప్రయం సాదించి పార్టీని పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టిస్తామని రఘువీరా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంత కుమార్, ఆనం సహోదరులు, చిరంజీవి, శైలజానాథ్, డొక్కమాణిక్యవర ప్రసాద్, పనబాక లక్ష్మి, బొత్స, కొండ్రు మురళి, పార్థసారథి, బాలరాజు..వీరంతా కాంగ్రేస్ పార్టీ అధికాంలో ఉన్నప్పుడు అతిరథ మహారథులుగా చలామణి అయ్యారు.అధిష్టానంతో అనూహ్యంగా సంప్రదింపులు జరుపుతూ,ప్రతిపక్ష నేతల సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతూ,విభజన ప్రక్రియపై ఏదో ఒక ప్రకటన చేస్తూ తరుచూ మీడియాలో హల్ చల్ చేస్తుండేవారు.ఇంతటి ప్రాచూర్యం సంపాదించిన సదరు నేతలు కొందరు పార్టీని వీడగా మరికొందరు అరణ్యవాసం చేస్తున్నట్టు అసలు ప్రజా జీవితాన్ని పూర్తిగా విస్మరించారు.

2019లో ప్రభావం చూపకపోతే కష్టం.. మనుగడ ప్రశ్నార్థకమే..
నూటా ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రేస్ ప్రస్థానానికి నాయకుల ప్రవర్తనల వల్ల గండి పడ్డ పరిస్తితి తలెత్తింది. రాజకీయ అనుభవం ఉన్న నేతలుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి పార్టీని ప్రజల్లో సజీవంగా ఉంచగలిగే అవకాశం ఉన్నప్పటికి ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీమాంద్ర కాంగ్రేస్ కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం.ఇహ దయనీయ స్థతిలో ఉన్న కాంగ్రేస్ పార్టీకి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలు వరంలా మారాయి. కర్ణాటక ఎన్నికలు ఇచ్చిన స్పూర్తితో పార్టీకి మళ్లీ జీవం పోస్తామంటున్నారు ఏపి కాంగ్రేస్ అద్యక్షుడు రఘువీరారెడ్డి. కార్ణాటకలో బీజేపీ ఓటమితో కాంగ్రెస్ పార్టీ పుంజుకునట్టేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అందుకు తగ్గట్టు పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఏపి లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో రాహుల్ ఏపిలో పర్యటించి పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి, నూతన జవసత్తువలు నింపేందుకు ప్రణాళిక రిచిస్తున్నారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల్లో కాంగ్రేస్ పార్టీ పై ఉన్న ఆగ్రహం ఏమేరకు చల్లబడిందో తెలుసుకొనే ప్రయత్నం చేయడంతో పాటు, టీడీపీ హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కూడా క్యాష్ చేసుకొని లైమ్ లైట్ లోకి వచ్చేందుకు కాంగ్రేస్ వ్యూహం రచిస్తోంది.

రాహుల్ మంత్రం పనిచేస్తుందా..
పరిపూర్ణ ఓటమిని చవిచూసి ప్రజలకు దూరమైన పార్టీలో ఉండాలా లేక ఇతర పార్టీలోకి వెళ్లిపోయి రాజకీయ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలా అని మిగిలిన నేతలు సమాలోచనలు సాగిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా కాంగ్రేస్ పార్టీ నుండి ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్లిపోవడానికి సిద్దంగా లేరని, ఇతర పార్టీ నేతలు కాంగ్రేస్ నేతలను ఆకర్శించేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రేస్ నేతలు చెప్పడం విశేషం. ఏపీ మిగిలి ఉన్న కాంగ్రేస్ నేతలు స్తబ్దుగా కాలం వెళ్ల దీస్తున్న పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు రాహుల్ గాంధీకి సహకరిస్తారా లేక పార్టీ మారి తమ స్వలాభం చూసుకుంటారా వేచిచూడాలి.