• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాక్షి ప్రసారాలు బంద్: కెఎస్ఆర్ లైవ్ షోకు కూడా లింక్?

By Pratap
|

హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలు ఆగిపోయినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా ప్రసారం చేసిన కథనాలపై ఎంస్ఓలు ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపేశారు. నిజానికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రమేయం లేకుండా ఎంఎస్ఓలు ఆ పనిచేస్తారని అనుకోవడానికి వీల్లేదు.

తన ప్రమేయం ఉన్న విషయాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కెసిఆర్ కూడా అంగీకరించారు. టివీ9 క్షమాపణలు చెప్పడంతో దాన్ని వదిలేశారు. కానీ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు మాత్రం చాలా రోజులు ఆగిపోయాయి. ఎట్టకేలకు ఆ చానెల్ ప్రసారాల పునరుద్ధరణ తెలంగాణలో జరిగింది.

తెలంగాణలో ఆ చానెల్స్ ప్రసారాలు నిలిచిపోయినప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడిన పార్టీల్లో తెలుగుదేశం కూడా ఉంది. చానెల్స్ ప్రసారాలను నిలిపేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. నిజానికి, తమకు నచ్చని మీడియాపై ప్రభుత్వాలు కన్నెర్ర చేయడం పరిపాటి. వాటికి దూరంగా ఉండడం, వాటిని ఎత్తిచూపడం చేస్తుంటాయి.

Also Read: మారిన గూడు: జగన్ సాక్షి మీడియాలో ఇక లైవ్ విత్ కెఎస్ఆర్

 Is it right to stop Sakshi TV channel in AP?

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల గురించి వైయస్ రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు నిప్పులు కక్కారు. కానీ వాటి ప్రసారాలు ఆగిపోలేదు. మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాజకీయ నేతల్లో వైఎస్ మొదటివారు కారు, చివరి వారు కారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు టీ న్యూస్, సాక్షి టీవీ ప్రతినిధులకు అనుమతి లేకపోవడం చాలా కాలం నుంచి కొనసాగుతోంది.

తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను నిలిపేశారు. ప్రభుత్వమే నిలిపేసిందని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాస రావు చెబుతున్నారు. ప్రజలను రెచ్చగొడుతుందనే కారణాన్ని ఆయన చూపించారు. సాక్షి మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిదనే విషయం అందరికీ తెలిసిందే. వార్తాకథనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ప్రసారం చేస్తుందనే విషయం ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు.

నిజానికి, ఏ పత్రిక, ఏ టీవీ చానెల్ ఏ పార్టీకి అనుకూలమో, ఏ పార్టీకి వ్యతిరేకమో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆ కారణంగా మీడియా విశ్వసనీయత కూడా ప్రమాదంలో పడింది. ప్రజలు పత్రికలను చదివి, టీవీ ప్రసారాలు చూసి అందులో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా వరకు వారు సరిగానే అర్థం చేసుకుంటున్నారు.

ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు తమకు అనుకూలంగా ఉండే మీడియా పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. వాటిలో వచ్చే వార్తాకథనాలు నిజమా, అబద్ధమా అనేది వారికి అవసరం లేదు. అందుకు అనుగుణంగానే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. ఎదుటివారిని తెగడి, తమవారిని పొగిడితే దాన్నే ఆనందంగా వారు స్వీకరిస్తారు. ఈ పక్షపాత వైఖరికి వారు పెద్ద పీట వేస్తారు. వాస్తవం మాట్లాడే మీడియా ఇరు పక్షాలకు కూడా నచ్చకపోవచ్చు.

Also See: KSR LIVE SHOW: తప్పు కోవడం వెనుక రాజకీయ నేతల హస్తం?

 Is it right to stop Sakshi TV channel in AP?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రాంతాల్లో టీవీ ప్రసారాలను అపేడయం ఇదే మొదటి సారి కూడా కాదు. గతంలో ఎన్టీవీ కూడా ఆ సమస్యను ఎదుర్కుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో టీన్యూస్‌కు అక్కడ స్థానమే లేదు. ఇప్పుడు కూడా ఉందో లేదో తెలియదు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు ఎన్టీవీలో తన లైవ్ విత్ కెఎస్ఆర్ షోను ఆపాల్సి వచ్చింది. ఎన్టీవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు కూడా.

ఈ నెల 13వ తేదీ నుంచి కెఎస్ఆర్ లైవ్ షో సాక్షి టీవీ చానెల్‌లో వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. టిడిపికి నచ్చని జర్నలిస్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నచ్చడం సహజమే. బహుశా ఆ కారణంగానే కొమ్మినేని శ్రీనివాస రావును సాక్షి యాజమాన్యం ఆహ్వానించి ఉంటుంది. సాక్షి చానెల్ ఒక్కటే కాదు, ఏ ఏదైనా ద్వేషపూరితమైన, విద్వేషపూరితమైన వార్తాకథనాలను ప్రచురిస్తే చట్టపరంగా వాటిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఉదయం దినపత్రికలో విద్వేషపూరితమైందంటూ వివాదం చెలరేగుతున్న కాలంలో ఆ కథను అచ్చేస్తూ ఓ వ్యాఖ్యానం రాసినందుకు అప్పటి ఆ పత్రిక సంపాదకుడు జైలు పాలయ్యారు. ఇటువంటి సందర్బాలు చరిత్రలో ఉండే ఉంటాయి. పరువు నష్టం కేసులు కూడా ఉన్నాయి. చట్టపరంగా మీడియాపై చర్యలు తీసుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి. కానీ, అధికారంలో ఉన్నామని చెప్పి ప్రసారాలను నిలిపేసే ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ, ఇప్పుడు దాన్ని మీడియా స్వేచ్ఛ అందాం. అది జర్నలిస్టుల స్వేచ్ఛ అనే అభిప్రాయం చాలా కాలం వరకు బలంగానే ఉంది. కానీ, అది యాజమాన్యాల స్వేచ్ఛగా మారిపోయింది. ఇప్పుడు అది ప్రభుత్వాల స్వేచ్ఛగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలున్నాయి.

English summary
Debate is going on the ban of YSR Congress party president YS Jagan's Sakshi TV channel telacast in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X