కలమట రాకతో శత్రుచర్లకు చెక్: ఒత్తిళ్లు పనిచేశాయా?
అమరావతి: ఏపీలో అధికారపక్షం వలసలకు తెరలేపడంతో రాజకీయాలు రంజుగా మారాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తాను టీడీపీలోకి చేరనున్నట్లు ప్రకటించడంపై టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ ప్రజల కోరడంతోనే చంద్రబాబుకు మద్ధతు ప్రకటిస్తున్నట్టు కలమట చెప్పిన మరుక్షణం నుంచే జిల్లాలోని టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని, కలమటను పార్టీలోకి ఎలా అహ్వానిస్తారంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజుకు చెక్ పెట్టేందుకే కలమటను పార్టీలోకి ఆహ్వానించినట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. విజయరామ రాజు రాకను తొలినుంచీ అడ్డుకుంటున్న జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల అక్కడి పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవర్గం మాత్రం కలమట రాకను అహ్వానిస్తున్నారు. మరోవర్గం మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. మొదట నుంచి తాము పార్టీలో ఉంటే.. పార్టీని వీడి వెళ్లిన వ్యక్తిని ఎలా దగ్గరకు చేర్చుకుంటారని జిల్లా మంత్రికి కార్యకర్తలు అప్పుడే ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం.
పాతపట్నం నియోజకవర్గంలో తాము కొత్తవ్యక్తితో మమేకం కాలేమని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే మెళియాపుట్టి మండల నేతలు పూర్తిస్థాయిలో కలమటను వ్యతిరేకిస్తున్నారు. పాతపట్నం ప్రాంతం కొన్నాళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని, 10గ్రామాల్లో భూములన్నీ ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని కలమట చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఆ విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అంటూ స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు లోనై పార్టీకి దగ్గరవుతున్నారంటున్నారంటూ కార్యకర్తలు నిలదీశారు. అంతేకాదు టీడీపీకి సహకరిస్తానని కలమట చెబుతుండడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో అందరికీ తెలుసునని అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కలమట చెప్పడం వెనుక ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురై పార్టీకి మద్ధతివ్వాల్సి వచ్చిందో చెప్పాలని పాతపట్నం నియోజక వర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications