సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ - సాక్షిలో పెట్టుబడులు సక్రమమే : సీబీఐవి ఆరోపణలే- కొట్టివేత..!!
ముఖ్యమంత్రి జగన్ కు భారీ ఉపశమనం లభించింది. సాక్షి మీడియాలో పెట్టుబడుల పైన పదేళ్లుగా సాగుతున్న వ్యవహారం పైన కీలక తీర్పు వెలువడింది. సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని నిర్దారణ అయింది. సాక్షి గ్రూపులో పెట్టుబడులన్నీ క్విడ్-ప్రో-కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ఐటీఏటీ కొట్టివేసింది.

సాక్షి సంస్థల్లో పెట్టుబడులు సక్రమమే
జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్మెంట్ల స్వీకరణలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్ పాటించిందని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. సాక్షి మీడియాలో వచ్చిన పెట్టుబడుల పైన పదేళ్లకు పైగా సాగుతున్న విచారణ.. వాదనలు పూర్తయిన తరువాత ట్రిబ్యునల్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. 2008-09 అసెస్మెంట్ సంవత్సరంలో సాక్షి మీడియా గ్రూపునకు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ముఖ విలువగల షేరుకు 350 రూపాయలు ప్రీమియం చెల్లించి కొనుగోలు చేశారు.

సీబీఐ చేసింది ఆరోపణలే
ఈ ప్రీమియం రూపంలో వచ్చిన రూ.277 కోట్లను ఆదాయంగా పేర్కొంటూ... దానిపై పన్ను చెల్లించాలని 2011లో నాటి ఐటీ అధికారి సంస్థకు నోటీసులిచ్చారు. జగతి సంస్థ దాన్ని సవాలు చేసింది. వివిధ విచారణల అనంతరం అదిపుడు ఐటీ ట్రిబ్యునల్ ముందుకు వచ్చింది. నాటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వు చెల్లదంటూ... అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీటును... అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. ఆ ఛార్జిషీట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా అంటూ ప్రశ్నించింది. ఆ ఛార్జ్ షీట్ ను అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తేల్చి చెప్పింది.

కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిషీట్లకు లేవంటూ
సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిషీట్లకు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. క్విడ్ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలు సంపాదించారా అని ప్రశ్నిస్తూనే సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా అంటూ నిలదీసింది. సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదని తేల్చి చెప్పింది. ముఖ విలువ రూపంలో స్వీకరించిన షేరుకు రూ.10ని మాత్రం చట్టబద్ధమైనదిగా... సక్రమమైనదిగా పేర్కొన్న ఐటీ అధికారి... ఆయా ఇన్వెస్టర్లకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు కట్టబెట్టిందని, అందుకే అంత ప్రీమియానికి వారు ఇన్వెస్ట్ చేశారని, క్విడ్ ప్రోకో రూపంలో వచ్చిన ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించాలని ఐటీ అధికారి పేర్కొనటాన్ని బెంచ్ తప్పుబట్టింది. కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది.

క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదంటూ తీర్పు
వారి విషయంలో ఎలాంటి క్విడ్ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్ ప్రో కో అని మీరెలా అంటారని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది.
కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీకి సంబంధించిన పాన్, రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నపుడు గుర్తు తెలియని ఆదాయం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఈ ఉత్త్వులు ప్రస్తుతం జగన్ కు రాజకీయంగానూ ఉపశమనం కలిగించే అంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి.