శ్రీలక్ష్మి రుణం తీర్చుకుంటున్న జగన్- మూడునెలల్లో రెండు ప్రమోషన్లు- సీఎస్ రేసులోకి ?
ఏపీలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత జగన్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న ఐఎఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిపై ఇప్పుడు జగన్ సర్కార్ అవాజ్యమైన ప్రేమ కురిపిస్తోంది. తెలంగాణ క్యాడర్లో ఉన్న ఆమెను కేంద్రం వద్దన్నా క్యాట్‌కు సాయంతో ఏపీకి రప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆమెకు వరుస ప్రమోషన్లతో సంచలనం రేపుతోంది. అదీ ఆమెపై ఉన్న కేసులకు లోబడేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే ఈ డబుల్ ప్రమోషన్ల వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.

ఐఏఎస్ శ్రీలక్ష్మికి జగన్ మరో ఆఫర్
తన అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉంటూ గతంలో జైలుపాలైన ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఏపీ సీఎం జగన్ మరోసారి అవాజ్యమైన ప్రేమ కురిపిస్తున్నారు. తన తండ్రి వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అక్రమాస్తుల కేసుతో పాటు ఓబుళాపురం కేసుల్లో నిందితురాలిగా మారి నానా ఇబ్బందులు పడ్డ ఆమెను తిరిగి తన ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగేలా చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమెకు వరుస ప్రమోషన్లు కల్పిస్తున్నారు. ఆమె కోరుకున్న శాఖకు పంపడమే కాకుండా అక్కడ కూడా వరుస ఆఫర్లతో ఆమెను ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మార్చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే అందుకు కారణం.

శ్రీలక్ష్మికి మూడు నెలల్లో రెండు ప్రమోషన్లు
తెలంగాణ క్యాడర్ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీ క్యాడర్‌కు వచ్చేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ నిరాకరించడంతో ఆ తర్వాత తన స్దానికతను హైదరాబాద్‌గా చూపించకుని క్యాట్ ద్వారా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇక్కడికి వచ్చారు. వచ్చీ రాగానే ఆమెను పురపాలకశాఖలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నియమించిన వైసీపీ సర్కార్.... ఇప్పుడు అదే శాఖలో ఆమెను ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరిలో ప్రమోషన్ పొందిన ఆమెకు మార్చిలో మరో ప్రమోషన్ లభించింది. అంటే మూడు నెలల్లో రెండు ప్రమోషన్లన్న మాట.

నిబంధనలకు విరుద్ధంగా వరుస ప్రమోషన్లు
ఓబుళాపురం మైనింగ్ కేసులో క్రిమినల్ కేసుల విచారణ ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మికి జగన్ సర్కారు ఇప్పుడు డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆమెకు ఇచ్చిన ప్రమోషన్ ఆమెపై ఉన్న కోర్టు కేసులకు లోబడే ఉంటుందని పేర్కొంది. అంటే ఆమెపై ఓటుళాపురం మైనింగ్ కేసు ఉన్నందున ఆ కేసులో కోర్టు ఇచ్చే తీర్పుకు లోబడే ఈ ప్రమోషన్లు ఇస్తున్నారు. కానీ కళంకం ఉన్న ఐఏఎస్ అధికారులపై, అదీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులకు ఇలా విచ్చలవిడిగా ప్రమోషన్లు ఇచ్చేందుకు కూడా నిబంధనలు అంగీకరించడం లేదు. కానీ తాత్కాలిక ప్రాతిపదిక పేరుతో ఈ ప్రమోషన్లు ఇచ్చేస్తున్నారు.

శ్రీలక్ష్మిని సీఎస్ చేసేందుకేనా ప్రమోషన్లు ?
ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈ ఏడాది జూన్ 30 వరకూ ఉంది. ఆయన రిటైరయ్యాక శ్రీలక్ష్మికి సీఎస్‌గా మరో ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే శ్రీలక్ష్మిని ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చి, రెండు నెలలు కూడా గడవకముందే స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జూన్‌లో ఆదిత్యనాధ్ దాస్ రిటైర్ కాగానే శ్రీలక్ష్మిని సీఎస్ పోస్టులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆమెపై ఓబుళాపురం కేసుల విచారణ జాప్యం కూడా ప్రభుత్వానికి కలిసొస్తోంది.
శ్రీలక్ష్మికి మరో ఐదేళ్లకు పైగా సర్వీసు ఉంది. 2026 జూన్ 30 వరకూ ఆమె సర్వీసులో ఉంటారు. మరోవైపు నిబంధనల ప్రకారం ముఖ్య కార్యదర్శిగా ఐదేళ్లు కూడా పనిచేయకుండానే శ్రీలక్ష్మిని స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ ఇవ్వడాన్ని కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఆయన్ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను రాష్ట్ర సర్వీసులకు ఇవ్వాలని కోరగా.. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం దీనికి నిరాకరించింది.