అమరావతి ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్-2 నెలలు క్వార్టర్స్ వసతి-మరో ఏడాది ఐదోరోజులే పని
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య గ్యాప్ కొనసాగుతున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల విషయంలో మాత్రం సీఎం జగన్ వరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాజధానిలో సచివాలయ ఉద్యోగులకు క్వార్టర్స్ ను మరో రెండు నెలల పాటు కొనసాగించాలని ఇప్పటికే ఉత్తర్వులు ప్రకటించిన ప్రభుత్వం, ఇవాళ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సచివాలయ ఉద్యోగుల డిమాండ్ మేరకు ఐదు రోజుల పనిదినాల్ని మరో ఏడాది పొడిగించింది.

సచివాలయ ఉద్యోగులకు వరాలు
ఏపీలో సచివాలయ ఉద్యోగులకూ, ఇతర చోట్ల పనిచేస్తున్న ఉధ్యోగులకూ కొన్ని తేడాలున్నాయి. సచివాలయ ఉద్యోగులతో పాటు రాజధానిలో వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికశాతం హైదరాబాద్ నుంచి రాష్ట్రవిభజన సందర్భంగా ఇక్కడికి తరలివచ్చిన వారే.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం వీరికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. వీటిలో ఐదు రోజుల పనిదినాలతో పాటు రాజధానిలో క్వార్టర్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం సచివాలయానికి వచ్చి ఐదు రోజుల పాటు రాజధానిలోని క్వార్టర్ట్స్ లో ఉండి శుక్రవారం సాయంత్రం తిరిగి వారు హైదరాబాద్ వెళ్లిపోయేవారు. ఇప్పటికీ అదే పద్ధతి ఉంది.

రాజధానిపై స్పష్టత లేక కొనసాగింపులు
గతంలో టీడీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఐదేళ్లలో సచివాలయ ఉద్యోగులు ఏపీకి వచ్చేస్తారని చంద్రబాబు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే వెసులుబాట్లు కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాది కూడా వెసులుబాట్లు ఇచ్చింది.
అనంతరం మూడు రాజధానులు తెరపైకి రావడదంతో వెసులుబాట్లు ఎత్తేయాలని భావించింది. అయితే ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్లతో కొనసాగించక తప్పలేదు. ఇప్పటికీ రాజధానిపై క్లారిటీ లేక వీరికి ఏటా వెసులుబాట్లు పొడిగించాల్సి వస్తోంది.

మరోసారి జగన్ వెసులుబాటు
ప్రస్తుత పరిస్ధితుల్లో రాజధానిపై హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం బహిరంగంగానే మూడు రాజధానులు తెస్తామని చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ ను మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సచివాలయం మరియు HOD కార్యాలయాలు వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. దీంతో సచివాలయ ఉద్యోగసంఘ నేత వెంకట్రామిరెడ్డి సీఎం జగన్ కు కృతజ్ఢతలు తెలిపారు.