జగన్ సర్కార్ కీలక నిర్ణయం- కోనసీమ జిల్లా పేరు అంబేద్కర్ కోనసీమగా మార్పు
ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణలో కొకత్త జిల్లాగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనికి కోనసీమ జిల్లాగా నామకరణం చేసింది. అయితే ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎస్సీ జనాభా మనోభావాల మేరకు కోనసీమ జిల్లాను కాస్తా అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్లు వినిపించాయి. దీనిపై తొలుత మౌనంగా ఉన్న ప్రభుత్వం.. ఇవాళ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమగా నామకరణం చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇస్తోంది. దీంతో ఇకపై గతంలో అమలాపురం నుంచి కోనసీమ జిల్లా అయిన ఈ పార్లమెంటరీ నియోజకవర్గం కమ్ జిల్లా కాస్తా ఇకపై అంబేద్కర్ కోనసీమగా మారబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు.

కోనసీమ జిల్లాలో పుట్టి పెరిగి, లోక్ సభస్పీకర్ వరకూ ఎదిగిన దివంగత నేత జీఎంసీ బాలయోగి లేదా అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తూ గతంలో మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా సీఎం జగన్ కు లేఖ రాశారు. అలాగే జిల్లాకు చెందిన వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఈ మేరకు డిమాండ్లు వినిపించారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఇవాళ తన నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై కొత్త జిల్లా పేరు అమల్లోకి రానుంది.