ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. మరోసారి సస్పెన్షన్ వేటు?
సీనీయర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్‌ను ఎట్టకేలకు తొలగించుకోగలిగారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే మంగళవారం జరిగిన బదిలీల్లో మాత్రం ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసిందని, పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ఉండకపోవచ్చేమోననే సందేహాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

పోస్టింగ్ అంశం ప్రాసెస్‌లో పెడతామన్న సీఎస్
సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏబీవీ సీఎస్‌కు ఇచ్చి రెండు వారాలు దాటింది. సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను కలిసిన ఏబీవీ మరోసారి కలవడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదని సమాచారం. పోస్టింగ్ అంశం ప్రక్రియలో పెడతామని చెప్పారుకానీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదంటూ విశ్రాంత ఐపీఎస్ అధికారుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీ స్థాయి అధికారిపట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్ అనగానే ఉత్తర్వులు
సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి ఏబీవీ సిద్ధమయ్యారంటూ వార్తలు రాగానే ప్రభుత్వం హడావిడిగా జీవో జారీచేసి ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసిందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రెండు సంవత్సరాల సస్పెన్షన్ మినహా ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి సర్వీసులోకి తీసుకోవాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఉంది. అయితే సస్పెన్షన్ చేసినరోజు నుంచే సర్వీసులోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో ఉన్నట్లు ఏబీవీ తెలిపారు.

2 సంవత్సరాల కాలాన్ని ఏం చేస్తారు?
ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం ఆ రెండు సంవత్సరాల సస్పెన్షన్ అలాగే ఉంది. సస్పెన్షన్ చేసిన రోజు నుంచి ఆయన సర్వీసులో ఉన్నట్లే లెక్క. ఆ ప్రకారం ఆయనకు రావల్సిన జీతభత్యాలు, పదోన్నతి తదితరాలన్నింటినీ క్రోడీకరించి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందుకు ఎంత సమయం తీసుకుంటారో తెలియదుకానీ ఏదో ఒక కారణం చూపి ఆయనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వవర్గాలంటున్నాయి.