పవన్ యాత్రకు అడ్డంకులు-మధ్యలో రోడ్డు తవ్వేసి-తీవ్ర పరిణామాలు తప్పవన్న నాదెండ్ల
ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కార్ పై పోరుకు సిద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అధికార పార్టీ ఎక్కడికక్కడ టార్గెట్ చేస్తున్నట్లుకనిపిస్తోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లాలో ఆయన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర మార్గంలో రోడ్లు తవ్వేశారు. దీనిపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి రానున్నారు. ఈ నేపథ్యంలో యాత్రను అడ్డుకునేందుకు లేదా ఆటంకాలు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం వద్ద ఆర్ అండ్ బి రహదారిని అడ్డంగా తవ్వించేయండంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తున్నట్లు తెలుసుకని నాదెండ్ల మనోహర్ అక్కడికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన నాదెండ్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతో కలిసి జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాదెండ్ల వారిని హెచ్చరించారు.