andhra pradesh cbse ys jagan orders ap govt ap news ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆదేశాలు మార్పిడి ఏపీ ప్రభుత్వం
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందే
ఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు మాధ్యమాన్నే కాదు సిలబస్ (పాఠ్య ప్రణాళిక)ను సైతం మార్చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈసీ సిలబస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వేలాది ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడున్న రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈ సిలబస్‌కు వచ్చే విద్యాసంవత్సరం నుంచే మారక తప్పని పరిస్ధితి.

ఏపీలో విద్యారంగం సంస్కరణలు
ఏపీలో విద్యారంగంలో పెను మార్పులకు జగన్ సర్కార్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో తెలుగు మీడియం స్ధానంలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. వాటిని హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుతోంది. ఇప్పుడు అదే కోవలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి సిలబస్‌ను కూడా రాష్ట్ర స్ధాయి నుంచి జాతీయ స్ధాయికి పెంచాలని నిర్ణయించింది. అంటే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెడరారు. దీనిపై సీఎం జగన్ నిన్న విద్యాశాఖ సమీక్షలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర సిలబస్ స్ధానంలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలన్న నిర్ణయం వాస్తవానికి చాలా కష్టతరమైనది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వేలాది పాఠశాలల్లో విద్యార్ధులు రాష్ట్ర సిలబస్‌లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వారు ఇదే సిలబస్ ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అమలు చేయబోతున్న సీబీఎస్ఈ సిలబస్ కారణంగా వారంతా దీనికి మారాల్సి ఉంటుంది. అదీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వారితో పాటు తల్లితండ్రులు, టీచర్లలోనూ గుబులు రేపుతోంది.

ఈసారికి ఏడో తరగతి వరకే అమలు
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర సిలబస్ స్ధానంలో ప్రవేశపెట్టే సీబీఎస్ఈ సిలబస్‌ను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఫలితాల ఆధారంగా విడుదల వారీగా మిగతా తరగతులకూ దీన్ని వర్తింపజేస్తారు. ఇలా 2024 కల్లా అంటే వచ్చే మూడేళ్లలో పదో తరగతి విద్యార్ధులకూ సీబీఎస్ఈ సిలబస్‌లోనే బోధన కొనసాగిస్తారు. అంటే 2024 కల్లా ఏఫీలో అన్ని ప్రభుత్వ పాఠశాలలూ రాష్ట్ర సిలబస్‌ను వదిలిపెట్టి సీబీఎస్ఈ సిలబస్‌కు మారిపోతాయన్నమాట. ఇందుకోసం విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విద్యార్ధులక, టీచర్లకూ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇంగ్లీష్ మీడియం తేలకముందే మరో వివాదం
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయాలని నిర్ణయించిన ఇంగ్లీష్ మీడియం విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుతున్నారు. అక్కడా సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. విచారణ మధ్యలోనే న్యాయమూర్తులు మాతృభాషను వదిలి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం సరికాదనేలా వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర సిలబస్‌ను కాదని సీబీఎస్ఈ సిలబస్‌కు మారాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.