వాలంటీర్లకు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్- మూడు కేటగిరీల్లో అవార్డులు- వివరాలివే
ఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించేందుకు వీలుగా వైసీపీ సర్కార్ నియమించిన 2.67 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు గౌరవ వేతనం పెంపు కోసం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వారికి తీపికబురు చెప్పింది. ఈ ఏడాది ఉగాది నుంచి వారికి పనితీరు ఆధారంగా రివార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కారు.. తాజాగా ఇందుకోసం మూడు కేటగిరీలు కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పనితీరు ఆధారంగా వాలంటీర్లకు ఈ ఏడాది ఉగాది నుంచి పురస్కారాలు, నగదు బహుమతి అందజేస్తారు.

వాలంటీర్లకు జగన్ కొత్త ఆఫర్
ఏపీలో లక్షలాది ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరవేస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారి పనితీరుకు గుర్తింపునిచ్చేలా ఈ ఏడాది ఉగాది నుంచి పురస్కారాలు, నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. వారిలో పని ఉత్సాహం మరింత పెంచేందుకు వీలుగా ఈ పురస్కారాలు అందించనున్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు, పనితీరు ఆధారంగా వారిని మూడు కేటగిరీలుగా విభజించి ఈ అవార్డులు, రివార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు పురస్కారాలు
ఏపీలో వాలంటీర్లకు వారి పనితీరు ఆధారంగా పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం మూడు కేటగిరీలు ఏర్పాటు చేసింది. ఇందులో తొలి కేటగిరిలో ఏడాదిపాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలిస్తారు. ఇందులో ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం, బ్యాడ్జ్‌తో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే రెండో కేటగిరీలో ప్రతి మండలం, లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేస్తారు. వీరికి సేవారత్న పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాడ్జ్, రూ.20 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. అలాగే మూడో కేటగిరీలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వాలంటీర్లను ఎంపిక చేస్తారు. వీరికి సేవా వజ్రం పేరిట పురస్కారంతో పాటు స్పెషల్ బ్యాడ్జ్, మెడల్, రూ.30 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు.

జీతాల పెంపు డిమాండ్ల నేపథ్యం
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సేవాభావంతో పనిచేసే వారిని కేవలం 5 వేల రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్లుగా నియమించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకు వీరిని నియమించారు. అయితే వీరిని నియమించి రెండేళ్లు కావస్తుండటంతో తమ జీతాన్ని 5వేల నుంచి 10 వేలకు పెంచాలని కోరుతూ ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మిమ్మల్ని స్వచ్ఛందంగా సేవ చేసేందుకు నియమించాం కానీ జీతాల డిమాండ్ల కోసం కాదని సీఎం జగన్ ఓ లేఖ రాశారు. ఆ తర్వాత కూడా వారిపై అసంతృప్తి తగ్గలేదని గమనించి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

వాలంటీర్లకు రూ.18 వేలు ఇస్తామంటున్న టీడీపీ
వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్ధతో ప్రజల్లో మంచి మైలేజ్ కనిపిస్తున్న నేపథ్యంలో విపక్ష టీడీపీ కూడా అప్రమత్తమైంది. మొదట్లో వాలంటీర్లను తీవ్రంగా విమర్శించిన టీడీపీ ఇప్పుడు వారి జీతాల పెంపు డిమా్ండ్‌ను ఓన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.18 వేల జీతం ఇస్తామని ప్రకటించారు. దీంతో వాలంటీర్లలోనూ కొత్త ఆశలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడే ఎన్నికలు లేకపోవడంతో ఈ హామీకి అంతగా ప్రాధాన్యం లేకుండా పోయింది. కానీ భవిష్యత్తులో వాలంటీర్లు ఇదే డిమాండ్ వినిపిస్తే మాత్రం వైసీపీకి కష్టాలు తప్పకపోవచ్చు.