
ఎయిడెడ్ పై జగన్ సర్కార్ యూటర్న్-హైకోర్టుకు కీలక హామీ-వెనక్కి తగ్గినట్లేనా ?
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని, వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని, వాటికి ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్ ముప్పేట దాడితో ఇవాళ వెనక్కి తగ్గింది. ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు ఒత్తిడి పెంచుతుండటంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఇవాళ కీలక ప్రశ్నలు సంధించింది.
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధలు, వాటి ఉపాధ్యాయులు, ఆస్తుల విలీనం కోసం ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. విద్యాసంస్ధలు విలీనం చేయకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపేస్తామంటూ ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలపై యాజమాన్యాలు హైకోర్టు దృష్టికి తెచ్చాయి. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణ సందర్భఁగా విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడిని హైకోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు.

ఎయిడెడ్ విద్యాసంస్ధల విలీనం వ్వవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు క్లారిటీ ఇచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్ధలను బలవంతంగా విలీనం చేసుకోవడం లేదని ఆయన హైకోర్టుకు తెలిపారు. విలీనం కాని వితద్యాసంస్ధలకు గ్రాంట్ ను నిలిపేయాలన్న నిర్ణయంపైనా వెనక్కి తగ్గారు. బలవంతంగా విద్యాసంస్ధలను విలీనం చేసుకోవడం లేదని, స్వచ్చంధంగా విలీనమయ్యే వాటినే తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపారు. అలాగే విలీనం చేయని విద్యాసంస్ధలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సైతం కొనసాగిస్తామని హైకోర్టుకు ఆయన హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
వాస్తవానికి దశాబ్దాలుగా సేవా దృక్ఫధంతో విద్యాసంస్ధలు నడుపుతున్న ఎయిడెడ్ యాజమాన్యాలు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నాయి. తమ ఆస్తుల్ని, భవనాల్ని స్వాధీనం చేసుకుంటామన్న ప్రభుత్వ హెచ్చరికల్ని హైకోర్టు దృష్టికి తెచ్చాయి. దీంతో హైకోర్టుకు హాజరైన విద్యాశాఖ కమిషనర్.. అలా చేయకుండా 13 జిల్లాల విద్యాశాఖ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది.