నారాయణ బెయిల్ రద్దుకు జగన్ సర్కార్ పిటిషన్-చిత్తూరు కోర్టు నోటీసులు
ఏపీలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణ విద్యాసంస్ధల అధినేత, మాజీ మంత్రి నారాయణను ప్రభుత్వం ఇప్పట్లో వదిలే అవకాశాలు కనిపించడం లేదు. ప్రశ్నాపత్రాల లీక్ కు నారాయణ స్కూల్ యాజమాన్యమే బాధ్యులని నిర్ధారిస్తూ నారాయణను అరెస్టు చేసిన పోలీసులు.. చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ స్కూల్ యాజమాన్య బాధ్యతల నుంచి 2014లోనే తాను తప్పుకున్నట్లు నారాయణ ఆధారాలు సమర్పించడంతో ఆయనకు బెయిల్ లభించింది. దీన్ని ఇవాళ ప్రభుత్వం సవాల్ చేసింది.
నారాయణకు బెయిల్ ఇస్తూ చిత్తూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చిత్తూరు జిల్లా కోర్టులో ప్రభుత్వం ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అఢ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చిత్తూరు కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

గత నెల 27న జరిగిన పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసులో తొలుత నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఉన్న గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణతో పాటు తిరుపతి స్కూల్ డీన్ బాలగంగాధర్ తిలక్ ను కూడా అరెస్టుచేశారు. నారాయణను అయితే హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి తీసుకొచ్చారు. అయితే అర్ధరాత్రి వరకూ జరిగిన విచారణలో చిత్తూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ తో ఆయన తిరిగి వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో నారాయణను వదిలేది లేదని బహిరంగంగానే చెబుతోంది.