జిల్లాల సిత్రాలు-పశ్చిమలో ఏలూరుకు మరిన్ని కష్టాలు-భీమవరం మరింత పైపైకి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రభావం రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన పశ్చిమగోదావరిపై తీవ్రంగా పడబోతోంది. అందులోనూ ప్రస్తుత జిల్లా కేంద్రం ఏలూరుపై ఎక్కువగా ప్రభావం పడనుంది. మరోవైపు జిల్లాలో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న భీమవరం సహా ఇతర డెల్టా ప్రాంతాలు పునర్విభజనతో మరింత అభివృద్ధి చెందేందుకు బాటలు పడబోతున్నాయి.

పశ్చిమగోదావరి విభజన
రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లాను ఏపీ ప్రభుత్వం తాజా పునర్విభజనతో ఏలూరు, భీమవరం జిల్లాలుగా మార్చబోతోంది. ఇందులో ప్రస్తుతం ఏలూరులో జిల్లా కేంద్రం ఉండగా.. పునర్విభజనతో ఏలూరు, భీమవరం రెండు జిల్లా కేంద్రాలు కాబోతున్నాయి.
అలాగే ఏలూరు జిల్లాలో నూజివీడు, కైకలూరు వంటి ప్రస్తుత కృష్ణాజిల్లా నియోజకవర్గాలు కలవబోతున్నాయి. అలాగే భీమవరంలో ఇప్పటికే ఉన్న అభివృద్ధి చెందిన తాడేపల్లి గూడెం, నరసాపురం వంటి నియోజకవర్గాలు బలంగా మారబోతున్నాయి. దీంతో జిల్లా విభజనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఏలూరుకు నష్టం, భీమవరానికి లాభం
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రధాన ప్రాంతాలుగా ఉన్న ఏలూరు, భీమవరానికి పునర్విభజన వల్ల పలు లాభనష్టాలున్నాయి. ఇందులో ఏలూరు నష్టపోతుండగా.. భీమవరం ఆ మేరకు లాభపడబోతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరుకు పునర్విభజన కారణంగా నష్టం జరుగుతుందన్న అంచనాలున్నాయి. అలాగే ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న భీమవరం, అందులోకి వచ్చే నియోజకవర్గాలకు విభజన కచ్చితంగా మేలు చేయబోతోంది. దీంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.

రూరల్ జిల్లాగా ఏలూరు
ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ప్రభుత్వ కార్యాలయాలకు మినహా మార్కెట్, వాణిజ్య, వ్యాపార విద్యా, వైద్య వ్యవహారాల్లో అభివృద్ధి చెందలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ఏలూరుకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు జిల్లాల విభజనలో ఏలూరు 15 నియోజకవర్గాల పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం నుంచి కేవలం 7 నియోజకవర్గాల జిల్లా కేంద్రంగా పరిమితం కాబోతోంది.
దీనికి తోడు కొత్తగా పరిశ్రమలు, జాతీయస్ధాయి విద్యాసంస్ధలు రాకపోవడం, భారీ ప్రాజెక్టులు, మౌలిక సౌకర్యాలు సైతం అభివృద్ధి చెందకపోవడంతో ఏలూరుకు ఇప్పటికే ఉన్న కష్టాలు మరింత పెరగబోతున్నాయి. అన్నింటికంటే మించి ఏలూరులో కలుస్తున్న నియోజకవర్గాల్ని పరిశీలిస్తే దెందులూరు, చింతలపూడి, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు వంటివి అన్నీ గ్రామీణ నేపథ్యం ఉన్నవే. దీంతో ఏలూరు రూరల్ జిల్లాగా మారిపోతోంది.

భీమవరానికి మరింత మేలు
ఏలూరుకు భిన్నంగా భీమవరం నియోజకవర్గం పరిధిలోకి ఇప్పటికే అభివృద్ధి చెందిన భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం వంటి అర్బన్ నియోజకవర్గాలతో పాటు అక్వారంగం అభివృద్ధి చెందిన ప్రాంతమంతా దీని పరిధిలోకి వస్తోంది. దీంతో భీమవరం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటివరకూ భీమవరం చుట్టూ వచ్చే ఆదాయాన్ని జిల్లా ఆదాయంగా పరిగణించగా.. ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఆదాయ వనరులు ఈ జిల్లాను రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే జిల్లాల జాబితాలో అగ్రభాగాన నిలిపే అవకాశముంది. ఇప్పటికే ఎన్ఐటీ ఉన్న తాడేపల్లి గూడెం, విద్య, వైద్యరంగాల్లో అభివృద్ధి చెందిన భీమవరం, చుట్టుపక్కల ప్రాంతాలు తాజా విభజనతో మరింత ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.