
బడ్డెట్ అనుమతి లేకుండా రూ.94 వేల కోట్లు-జగన్ సర్కార్ సంచలనం-కాగ్ రిపోర్ట్ లో వెల్లడి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో ఆర్ధిక నిర్వహణపై ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఆంక్షలు విధిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం తన ఆర్ధిక నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ అకౌంటింగ్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే గత 9 నెలల కాలంలో జగన్ సర్కార్ ఏకంగా రూ.94 వేల కోట్లు బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

జగన్ సర్కార్ ఆర్ధిక నిర్వహణ
ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణ విషయంలో అపసోపాలు పడుతోంది. ముఖ్యంగా భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రభుత్వం ఉసురుతీస్తున్నాయి. అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్దితులు ఎదురయ్యాయి.
అదే సమయంలో కరోనా సంక్షోభం కూడా కుంగదీసింది. దీంతో ప్రభుత్వం సంక్షేమంలో రాజీ పడిందన్న విమర్శల్ని తట్టుకునేందుకు వీలైనన్ని దారులు వెతికింది. ఇలా తీసుకొచ్చిన అప్పుల్ని ఖర్చు పెట్టే విషయంలోనూ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ ఆమోదం లేకుండా 94 వేల కోట్ల ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు బడ్జెట్ ఆమోదం తప్పక ఉండాలి. కొన్నిసార్లు దీన్ని మీరినప్పుడు నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండూ చేయకపోతే బడ్జెట్ ఉల్లంఘనను రాజ్యాంగ సంస్ధలు తప్పుబట్టడం ఖాయం. ఇదే కోవలో తాజాగా కాగ్ అకౌంటెంట్ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ముఖ్యంగా రాష్ట్ర ఫైనాన్షియల్ కోడ్ ను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తుచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఇందులో ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.94 వేల కోట్లను బడ్డెట్ ఆమోదం లేకుండానే ఖర్చు చేసినట్లు తేల్చింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.

జగన్ సర్కార్ లోపాలివే
రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్.. బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకున్న మేరకు ఖర్చులు కానీ అప్పులు కానీ, నిధుల కేటాయింపులు కానీ చేయాల్సి ఉండగా..వాటిని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్లు కాగ్ తాజా రిపోర్ట్ లో తేలింది. ముఖ్యంగా బడ్డెట్ లో వివిధ ప్రభుత్వ విభాగాలకు వేల కోట్ల కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని తేల్చింది.
124 అంశాల్లో రూ.94 వేల కోట్ల బడ్డెట్ ఆమోదం లేని ఖర్చు జరిగినట్లు తేలింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 147 అంశాల్లో రూ.13398 కోట్లు ఆమోదానికి మించిన ఖర్చు చేసినట్లు తేల్చింది. అలాగే 2214 అంశాల్లో బడ్డెట్ లో రూ.30 వేల కోట్లకు పైగా ప్రభుత్వ విభాగాలకు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. ఇలాంటి మరికొన్ని లోపాల్ని కూడా కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. ఈ లోపాల్ని సరిదిద్ది తిరిగి తమకు నివేదిక పంపాలని కాగ్ అకౌంటెంట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరింది. దీంతో ప్రభుక్వం ఇప్పుడు ఆ లెక్కల్ని సరిచేసే పనిలో బిజీగా ఉంది.

జగన్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి?
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అష్టకష్టాలు పడి భారీ ఎత్తున అప్పులు తెస్తున్నా వాటిని ఖర్చు చేసే విషయంలోనూ నిబంధనల మేరకు చేయలేకపోతోంది. ముఖ్యంగా ఏటికేడాది బడ్డెట్ ప్రవేశపెడుతున్నా దాన్ని సక్రమంగా అమలు చేసే పరిస్దితి లేదు. భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమం కారణంగా లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి.
వీటిని సరిదిద్ది కాగ్ వంటి ఆర్ధిక విభాగాలకు లెక్కలు అప్పజెప్పడం తలకు మించిన భారంగా మారిపోతోంది. ఓవైపు అప్పులు తీసుకొచ్చి ఖర్చు చేయడమే ఇబ్బందికర పరిణామం అంటే మరోవైపు ఈ లెక్కల్ని సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.