నారాయణ బెయిల్ వెనుక షాకింగ్ రీజన్- వాదించేందుకు ఏపీపీ నిరాకరణ-చివరికి సస్పెండ్
ఏపీలో పదోతరగతి పరీక్షా పత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన నారాయణకు ఆ అర్ధరాత్రే బెయిల్ లభించింది. ఈ కేసులో పోలీసులు ఎంతో సీరియస్ గా దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించినా కోర్టు మాత్రం తెల్లవారు జాము వరకూ విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారంలో అంతకు మించిన ట్విస్టులు చోటు చేసుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ముఖ్యంగా నారాయణ అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

నారాయణ అరెస్టు, బెయిల్
టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజ్ కేసులో నారాయణ విద్యాసంస్ధల పాత్ర ఉందన్న పేరుతో సంస్ధ మాజీ ఛైర్మన్ అయిన నారాయణను పోలీసులు అరెస్టు చేసి చిత్తూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చి మరీ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సర్కార్ కు అసిస్టెంట్ పబ్లిక్ ప్లాసిక్యూటర్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో నారాయణకు సులువుగా బెయిల్ లభించింది. ఈ వ్యవహారంపై సర్కార్ ఆగ్రహంగా ఉంది.

వాదించేందుకు ఏపీపీ నిరాకరణ
నారాయణ కేసులో చిత్తూరు పోలీసులు మోపిన అభియోగాలపై స్ధానిక మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్లాసిక్యూటర్ సుజాత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నారాయణ బెయిల్ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు నిరాకరించారు. చిత్తూరు పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాదించాలని కోరినా స్పందించలేదు. నేరుగా ఫోన్లో డీఎస్పీ మాట్లాడినా ఏపీపీ సుజాత నుంచి స్పందన కరవైంది. దీంతో నారాయణకు భారీ ఊరటే లభించింది.

నారాయణకు భారీ ఊరట
ఎప్పుడైతే చిత్తూరు పోలీసులు నారాయణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుపై వాదించేందుకు ఏపీపీ సిద్ధం కాలేదో అప్పుడో ప్రభుత్వానికి చిక్కులు మొదలయ్యాయి. చివరికి స్దానికంగా మరో న్యాయవాదిని తీసుకెళ్లి వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ వాదనలు కాస్తా ఫెయిల్ అయ్యాయి. నారాయణ 2014లోనే నారాయణ విద్యాసంస్ధల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆధారాలు మెజిస్ట్రేట్ కు సమర్పించారు. దీంతో ఆయనకు తెల్లవారు జామున బెయిల్ లభించింది. అదే నారాయణ ఆధారాలకు వ్యతిరేకంగా ఏపీపీ హాజరై గట్టిగా వాదనలు వినిపించి ఉంటే పరిస్దితి మరోలా ఉండేదని తెలుస్తోంది.

ఏపీపీ ని సస్పెండ్ చేసిన జగన్ సర్కార్
ప్రభుత్వ న్యాయవాది అయి ఉండి పోలీసులు కోరినా, స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయిన ఏపీపీ సుజాతను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నారాయణకు సులువుగా బెయిల్ లభించడం వెనుక ఆమె నిర్లక్ష్యం ఉందనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం వేటు వేసినట్లు తెలుస్తోంది. తదుపరి విచారణ జరిగే వరకూ ఆమె జిల్లా కేంద్రం దాటి వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో ఇప్పుడు న్యాయ వర్గాల్లో సైతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.