అమరావతిపై మరో ప్లాన్ -చంద్రబాబు కట్టిన భవనాలు అద్దెకిస్తున్న జగన్-అప్పుపుట్టకే ?
ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసే క్రమంలో పలు భవనాలు నిర్మించింది. అయితే ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో అప్పటి నుంచి అవన్నీ మూలనపడ్డాయి. వాటిని ఈ మూడేళ్లలో వాడుకోకుండా చోద్యం చూసిన వైసీపీ సర్కార్.. ఇఫ్పుడు హైకోర్టు ఆదేశాల పేరుతో వాటిని అద్దెకిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు.

అమరావతిలో రాజధాని భవనాలు
అమరావతిలో రాజధాని ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన్న పలు భవనాలు ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ మూడేళ్లలో రాజధాని మార్పు పేరిట ప్రభుత్వం చేసిన ప్రచారంలో ఇక్కడికి ఎవరూ రాకుండా పోయారు. అదేసమయంలో ప్రభుత్వం కూడా ఈ భవనాల్ని వాడుకోకుండా పదిలేసింది. ఎలాగో విశాఖకు వెళ్లిపోతున్నామన్న కారణంతో ప్రభుత్వం అథికారులకు, ఎమ్మెల్యేలకు ఈ భవనాలు కేటాయించలేదు. దీంతో పనులు పూర్తయిపోయిన చాలా భవనాలు నిరుపయోగంగా మూలనపడి ఉన్నాయి. అయితే ఇన్నాళ్లకు వాటికి మోక్షం లభించేలా కనిపిస్తోంది.

లీజుకివ్వాలని నిర్ణయం
అమరావతిలో నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ భవనాలను వివిధ ప్రైవేటు సంస్ధలకు లీజులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఇచ్చిన ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో త్వరలోనే ఈ భవనాల లీజు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలిదశలో విట్ యూనివర్శిటీకి ఓ భవనం ఇచ్చేందుకు కూడా రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతికి రావాల్సిన పెద్ద సంస్ధలన్నీ తరలిపోయిన నేపథ్యంలో ఈ భవనాలకు డిమాండ్ కూడా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

లీజుల వెనుక షాకింగ్ రీజన్ ?
అమరావతిలో ప్రభుత్వ భవనాలను లీజుకు ఇవ్వాలని సీఆర్డీయే చేసిన ప్రతిపాదనల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైకోర్టు తీర్పు తర్వాత అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. అలాగని అభివృద్ధి చేద్దామంటే నిధులు లేవు. చివరికి రుణాలు ఇమ్మంటే బ్యాంకులు కూడా మొహం చాటేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అమరావతిలో భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటే భవనాల లీజులకూ పావులు కదుపుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై అమరావతిలో రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి.