ఏబీకి చుక్కలు చూపిస్తున్న జగన్-పోస్టింగ్ కోసం సచివాలయంచుట్టూ చక్కర్లు-సుప్రీం తీర్పూ బేఖాతర్
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పటికీ చుక్కలు చూపిస్తోంది. నిఘా పరికరాల కొనుగోలు కేసులో ఆయన్ను ఇరికించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం అది కాస్తా విఫలం కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్ధితి ఎదురైంది. అయితే ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సచివాలయం చుట్టూ చక్కర్లు కొట్టిస్తోంది.

జగన్, ఏబీ వెంకటేశ్వరరావు వైరం
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా వ్యవహరించిన సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుకూ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూ మధ్య వైరం మొదలైంది. అప్పటివరకూ కేవలం ఓ ఐపీఎస్ అధికారిగా మాత్రమే ఆయన్ను చూసిన జగన్.. తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టి వారిని టీడీపీలో చేర్చేందుకు ప్రయత్నించారని అభియోగాలు ఎదుర్కొన్న ఏబీపై కక్ష పెంచుకున్నారు.
దీంతో టీడీపీ ప్రభుత్వం స్ధానంలో తన సర్కార్ ఏర్పాటు కాగానే ఆయనపై విచారణకు ఆదేశించారు. నిఘాపరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయన్ను సస్పెండ్ చేయడంతో పాటు పూర్తిగా టార్గెట్ చేశారు. అయితే రెండేళ్ల సస్పెన్షన్ పూర్తి చేసుకున్న ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించి పోస్టింగ్ ఇవ్వాలనే ఆదేశాలు తెచ్చుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు
నిఘా పరికరాల కొనుగోళ్ల కేసులో జగన్ సర్కార్ మోపిన అభియోగాలతో రెండేళ్ల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అంతకు మించి సస్పెన్షన్ లో ఉంచడం కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు సస్పెన్షన్ నుంచి విముక్తి లభించింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి పోస్టింగ్ తీసుకునే అవకాశం లభించింది. దీంతో ఆయన సీఎస్ ను ఆశ్రయించారు.

పోస్టింగ్ కోసం చక్కర్లు
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తన సస్పెన్షన్ ముగిసినందున తాను ఎక్కడ సరిపోతానో చూసుకుని పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఈ మేరకు సచివాలయానికి వెళ్లి సీఎస్ సమీర్ శర్మకు సుప్రీంకోర్టును వివరిస్తూ ఓ లేఖను అందించారు. అయినా ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో నిన్న మరోసారి ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈసారి సీఎస్ సమీర్ శర్మ ఆయనకు దర్శనం కూడా ఇవ్వలేదు. ఏబీ వస్తున్నారని తెలిసి తాను సీఎం క్యాంపు ఆఫీసుకు జారుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్ ఛాంబర్ దగ్గరే ఎదురుచూసిన ఏబీ తర్వాత వెనుదిరిగారు.

సుప్రీంకోర్టు ధిక్కరణేనా?
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆయన సస్పెన్షన్ కాలం ఎప్పుడో ముగిసిపోవడంతో ఇప్పటికే ఆలస్యం అయినందున వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్తు తీర్పూ చెబుతోంది. అయినా ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం సచివాలయం చుట్టూ చక్కర్లు కొట్టిస్తోంది. అలాగే ఆయన సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతభత్యాల బకాయిల్ని కూడా చెల్లించడం లేదు. ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు థిక్కారంగానే కనిపిస్తోంది. అయితే పోస్టింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరి అనుసరిస్తే మరోసారి సుప్రీం గడప తొక్కేందుకు ఏబీ సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.