వరుసగా మూడో ఏడాది విద్యాకానుక విడుదల-బైజూస్ తో మెరుగైన విద్య ఖాయం-జగన్ హామీ
ఏపీలో వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుకను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. బడులు తెరిచిన తొలిరోజు నుండే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.

విద్యాకానుక విడుదలలో జగన్
దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రూ.931 కోట్లతో ప్రభుత్వ బడులలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 47 లక్షల మంది పిల్లలకు మంచి చేయబోతున్న రోజని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో చిక్కటి చిరునవ్వుతో పాలుపంచుకుంటున్న ప్రతి అక్కా, చెల్లెమ్మలకు,అవ్వా, తాతలకు, ప్రతిసోదరుడికి, స్నేహితుడికి ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి, చిట్టి బాబుకు ముందుగా పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ జగన్ ఉపన్యాసం ప్రారంభించారు.
వరుసగా మూడో ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుండగానే... పిల్లలు బడిలో అడుగుపెడుతున్నప్పుడే.. ఆ విద్యాకానుక పిల్లల చేతిలో పెడుతున్నామని జగన్ తెలిపారు. ప్రభుత్వ బడులు అన్నింటితో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా జగనన్న విద్యా కానుక కిట్‌ను అందిస్తోందన్నారు. బడికి వెళ్తున్న పిల్లలకు వారి ఇంటినుంచి బడికి వెళ్లడానికి, బడులలో బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా విద్యాకానుక ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.

చదువులతో పేదరికానికి చెక్
గత మూడు సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంటిలోనూ చదవులు ఉండాలని, అవి కూడా మామాలు చదువులు కాకుండా మెరుగైన ఇంగ్లిషు మీడియం చదువులు ఉండాలని,అప్పుడే ఆ పిల్లలు బాగా చదివి, పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బ్రతికే పరిస్థితి వస్తుందన్నారు. అప్పుడే పేదరికం పోతుందనే గొప్ప ఆశయంతో మూడు సంవత్సరాలుగా అడుగులు ముందుకువేస్తూ వచ్చామన్నారు.
రేపటి తరం పేదరికం పోవాలనే....ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కూడా వెనుకబడిన పేదలందిరికీ కూడా నవరత్నాల ద్వారా ఒకవైపు మంచి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.. మరో వైపున పిల్లలకు అంటే రేపటి తరం గురించి కూడా ఆలోచన చేశామన్నారు.. వారిని జాగ్రత్తగా పైకి తీసుకువస్తేనే రేపటి తరం పేదరికం నుంచి బయటపడుతుందన్న సంకల్పంతో.. పిల్లలకు చదవుకునేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిసున్నాం. నాణ్యమైన చదువులు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా ఆ పిల్లలు తమ తలరాతలు మార్చుకునే పరిస్థితి రావాలని అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు.

స్కూళ్లలో మార్పుల ఉద్యమం
అందులోభాగంగానే తమ పిల్లలను బడికి పంపిన తల్లులకు క్రమం తప్పకుండా... గత మూడేళ్లుగా వరుసగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేశామని జగన్ తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలోనే ఒక ఉద్యమంగా ప్రభుత్వ స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ... మనబడి నాడు-నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మన బడుల రూపురేఖలు మార్పు జరుగుతోందన్నారు.
బడికి వెళ్తున్న పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం గురించి గతంలో ఎప్పుడూ ఏ పాలకులూ ఆలోచన చేయలేదని, వాటి పరిస్థితిని కూడా మారుస్తూ.. జగనన్న గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చి, రోజూ మెనూ మారుస్తూ.. పౌష్టికాహారం ప్రతి పిల్లవాడికి చేరాలన్న ఉద్దేశ్యంతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
శ్రీమంతుల పిల్లలకు మల్లే మెరుగైన చదువుల కోసం...బడులలో ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చామని జగన్ తెలిపారు.
బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌తో పాటు వారికి చదువులు సులభంగా అర్ధమయ్యే విధంగా.. ఇంకామెరుగైన చదువులు అందుబాటులోకివచ్చే విధంగా.. ఆ పిల్లలకు సహాయకారిగా ఉండేటట్టుగా, శ్రీమంతుల పిల్లలు మాత్రమే రూ.24 వేలు కడితే.. అందుబాటులో ఉండే బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని జగన్ వెల్లడించారు. తద్వారా ఆ బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు ఆందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు.రేపటితరం భవిష్యత్తుమీద దృష్టిపెట్టిన ఏకైక ప్రభుత్వం మనది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలో పిల్లలు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆ పిల్లలు పోటీలో నిలబడగలుగతారా ? లేదా ? ఆ పోటీలో నిలబడ్డమే కాకుండా... ప్రపంచంతో పోటీపడి నెగ్గుకు రావాలన్న ఆరాటంతో మొత్తం విద్యావ్యవస్ధలోనే మార్పులు తీసుకువచ్చామన్నారు.

స్కూళ్లలో పెరిగిన పిల్లల సంఖ్య
విద్యా కానుక ద్వారా ఇస్తున్న కిట్లలో ప్రతియేటా ఒకవైపు నాణ్యత పెంచుకుంటూ పోతున్నామని, మరోవైపున విద్యార్ధుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుందని జగన్ సంతోషంగా చెప్పారు.. ఇలా నాణ్యత పెంచే కొద్ది, విద్యార్ధుల సంఖ్య పెరిగే కొద్దీ, విద్యాకానుక పథకం మీద పెడుతున్న ఖర్చు కూడా పెరుగుతూ పోతుందన్నారు.
అయినప్పటికీ ఎక్కడా కూడా మీ జగన్.. అంటే ఆ పిల్లలకు మేనమామ ఎక్కడా వెనుకడుగు వేయలేదని ఆ పిల్లలకు తెలియజేస్తున్నాను. నా చెల్లెమ్మలకు అంటే ఆ పిల్లల తల్లులకు తెలియజేస్తున్నానన్నారు. మొట్టమొదది సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరంలో సగటున ఒక్కో కి ట్‌కు రూ.1531ఖర్చు చేశామని, మొత్తంగా 42,34,322 మంది పిల్లలకు రూ.650 కోట్లు ఖర్చు చేస్తూ ఆ ఏడాది విద్యాకానుక కిట్లు అందజేశామన్నారు. ఆ తర్వాత 2021-22లో ఒక్కో కిట్‌కు సగటున రూ.1726 ఖర్చు చేస్తూ..45,71,051 మంది పిల్లలకు రూ.790 కోట్లు వ్యయంతో విద్యాకానుక కిట్లు అందజేశాం.
ఈ సంవత్సరం మూడో ఏడాదికి వచ్చేసరికి... ఏకంగా ఒక్కో కిట్టుకు రూ.1964 ఖర్చైంది. అందే దాదాపు రూ.2 వేలు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతారని భావిస్తున్నాం. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని దాదాపు 47 లక్షల మంది పిల్లలకు విద్యా కానుక కిట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీనికోసం రూ.931 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు.

బైజూస్ తో పెనుమార్పులు
దీంతో పాటు ఈ సంవత్సరం ఆ పిల్లల జీవితాలను మెరుగుపర్చేందుకు ఇంకో అడుగు ముందుకు వేశామని, ప్రతి పిల్లవాడు, ప్రతిపాప 8వతరగతిలోకి అడుగుపెడితే చాలు.. ప్రతి ఒక్కరికీ ఈ సెప్టెంబరు అంటే మరో రెండు నెలల్లోనే ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నామని జగన్ తెలిపారు. దాని విలువ దాదాపు రూ.12వేలు అని అంచనా వేశామన్నారు. 4.70 లక్షల మంది పిల్లలు 8వతరగతిలోకి అడుగుపెట్టబోతున్నారని, ట్యాబ్ విలువ రూ.12 వేలు అంటే మరో రూ.500 కోట్లు పిల్లల భవిష్యత్ మీద ఖర్చు పెట్టబోతున్నామన్నారు. బైజూస్ సంస్ధతో ఒప్పందం చేసుకుని ఆ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా సులభంగా అర్ధమయ్యే విధంగా ఆ ట్యాబ్‌లోకి అనుసంధానం చేయబోతున్నామని జగన్ తెలిపారు.
రేపు మన పిల్లలు 2025 మార్చిలో సీబీఎస్ఈ పరీక్షలు ఇంగ్లిషు మీడియంలో రాస్తే వారు మెరుగైన ఫలితాలతో బయటపడాలి, మంచి చదువులు రావాలన్న ఉద్దేశ్యంతో బైజూస్ సంస్ధతో ఒప్పందం చేసుకుని, ట్యాబులు కూడా ఇచ్చి 8 వతరగతి నుంచి పిల్లలను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నామన్నారు.