ఆ ఆలయాల పునర్నిర్మాణానికి రేపే ముహూర్తం .. ప్రతిపక్షాలకు, ముఖ్యంగా చంద్రబాబుకు జగన్ షాకింగ్ సమాధానం
ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలపై ప్రతిపక్షాల విమర్శలను వైసీపీ సర్కార్ చెక్ పెట్టబోతుందా ? అందుకు ముహూర్తం ఖరారు చేసిందా ? ప్రజలకు వైసీపీ సర్కార్ కు హిందూ ఆలయాలపై ఉన్న భక్తిని తెలియజేయటంతో పాటు ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తుందా ? అంటే అవును అనే సమాధానమే వస్తుంది .

ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలకు జగన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహ విధ్వంసం ఘటనలు, ఆలయాలపై దాడులు వైసీపీ సర్కార్ వచ్చినప్పటినుంచి కొనసాగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ క్రిస్టియన్ కాబట్టి మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా , విగ్రహ విధ్వంసాలు కొనసాగుతున్నా పట్టించుకోవటం లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు హయాలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణం
తెలుగుదేశం పార్టీ హయాంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆలయాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. తనకు ఆలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద భక్తి వుందన్న భావనను అందరికీ అర్థమయ్యేలా చెప్పటం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నాడు చంద్రబాబు హయాంలో కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మించడానికి సంకల్పించారు. చంద్రబాబు హయాంలో కూల్చివేసిన 9 దేవాలయాలకు సంబంధించి 3.79 కోట్ల రూపాయలతో తొలిదశలో పునః నిర్మాణ పనులకు సీఎం జగన్ రేపు భూమి పూజ నిర్వహించనున్నారు.
77 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్
గత సర్కారు హయాంలో కూల్చివేసిన వాటిలో ప్రస్తుతం స్థలం అందుబాటులో ఉన్న మేరకు తొలిదశలో తొమ్మిది ఆలయాలు పునర్నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టడం, హిందూ దేవాలయాల పై జగన్మోహన్ రెడ్డికి వివక్ష లేదని అందరికీ అర్థమయ్యేలా చెప్పటం కోసమే అని తెలుస్తుంది. అంతేకాకుండా 77 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి పనులు, విస్తరణ పనులకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు .
రేపు ఉదయం 11 గంటల 01 నిమిషాలకు అందుకు ముహూర్తంగా నిర్ణయించారు .

శనీశ్వర స్వామి ఆలయ నిర్మాణ ప్రాంతంలో శిలా ఫలకాల ఆవిష్కరణ
మొదట శనీశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు . అక్కడ భూమి పూజ చేసిన అనంతరం ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ,అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక అందుబాటులో ఉన్న స్థలాలలో ఆలయాలను నిర్మించి, గతంలో కూల్చిన మరికొన్ని ఆలయాల కోసం స్థలాల ఎంపిక పూర్తి కాగానే మిగిలిన చోట్ల కూడా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని ఏపీ సర్కార్ చెబుతోంది.

దాడులు జరిగిన అన్ని ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు
అంతేకాదు 13 జిల్లాల పరిధిలో వివిధ రకాల ఘటనల కారణంగా ఇటీవల నష్టం జరిగిన ఆలయాల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటామని వైసీపీ సర్కార్ స్పష్టం చేస్తోంది.
ఒకపక్క రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఏపీ లో జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసాల గురించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ , మత ప్రస్తావనలు తీసుకువస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు దానికి సమాధానంగా రివర్స్ ఎటాక్ చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.

హిందూ వ్యతిరేకి ముద్ర వేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పడుతుందా ?
ఈ నేపథ్యంలో జగన్ హిందూ దేవాలయాల పట్ల తనకున్న శ్రద్ధను, హిందూ దేవుళ్ళ పట్ల తనకున్న భక్తిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే గతంలో చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించడం కోసం రంగంలోకి దిగారు. టీడీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టనున్నారు .ఈ విధంగానైనా ఈ వివాదానికి అడ్డుకట్ట పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.