నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నట్లుగా సాగుతోన్న వివాదంలో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాబోదని మరోసారి స్పష్టం చేసిన సర్కారు.. ఎన్నికల కమిషన్ ను ప్రతివాదిగా పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగింది

నిమ్మగడ్డ దూకుడుకు కళ్లెం..
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డకే అధికారాలుంటాయని, ప్రభుత్వాన్ని సంప్రదించిన పిదప ప్రక్రియపై ఆయన ముందుకెళ్లొచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పడం, ఆ వెంటనే నిమ్మగడ్డ అఖిలపక్షం భేటీ నిర్వహించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని చెప్పడం, ఆ మేరకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. కానీ కరోనా పరిస్థితుల్లో పోలింగ్ కష్టతరమని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి కరోనా భయాలున్నాయని, వైరస్ ముప్పు పూర్తిగా తొలిగిపోయిన తర్వాతే ఎన్నికలకు వెళదామని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని.. ఎస్ఈసీకి ఘాటు లేఖ రాయడం, ప్రభుత్వ అసమ్మతి కారణంగా నిమ్మగడ్డ కలెక్టర్లతో కాన్ఫరెన్సును హుటాహుటిగా రద్దు చేసుకోవడం లాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటికి కొనసాగింపుగా..
జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేరిట..
ఎపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికలంటూ కమిషనర్ ఏక పక్షంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రకటన చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు. ఏ హైకోర్టులోనైతే నిమ్మగడ్డకు అనుకూల తీర్పులు వచ్చాయో.. అదే హైకోర్టును.. ఎన్నికల ప్రక్రియ వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. అంతేకాదు..

ఎస్ఈసీ తీరు సుప్రీంకు విరుద్ధం..
లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం ముందు నుంచీ చెబుతున్నా, ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిమ్మగడ్డ తీరు సుప్రీంకోర్టు తీర్పునకు కూడా విరుద్ధంగా ఉందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని, ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది మరణించారని సర్కారు గుర్తుచేసింది. గతంలో కరోనా భయంతోనే ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ.. ఇంకా కరోనా ప్రమాదం తొలగకముందే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే..

నిమ్మగడ్డ కంటే ముందుగా జగన్..
నిజానికి స్థానిక ఎన్నికల విషయంలో సర్కారు తీరును తప్పుపడుతోన్న నిమ్మగడ్డే ముందుగా మళ్లీ కోర్టుకు వెళతారని అంతా భావిస్తుండగా.. ఆయనకంటే ముందే ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించబోమని వైసీపీకి చెందిన ప్రముఖులు బాహాటంగా చెప్పేశారు. నిమ్మగడ్డను చంద్రబాబు శునకంతో పోల్చుతూ, ఎస్ఈసీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలంటూ మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో.. ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా, ఉత్కంఠగా మారింది.