చెత్త పనిపై జగన్ సర్కారు దిద్గుబాటు-కేంద్రం ఆగ్రహంతో కమిషనర్ సస్పెండ్, ఇద్దరికి నోటీసులు
ఏపీలో రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోయించిన ఘటనలో జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. కృష్ణాజిల్లాలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయని బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ చేసి మున్సిపల్ ఉద్యోగులు నిరసన తెలిపిన ఘటనలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావును సస్పెండ్ చేసింది. విజయవాడ, మచిలీపట్నంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీటిపై వివరణ ఇవ్వాలని ఇద్దరు కమిషనర్లకూ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా మరికొందరిపై చర్యలకూ రంగం సిద్ధం చేస్తోంది.

ఉయ్యూరు ఘటనలో కమిషనర్ సస్పెన్షన్
కృష్ణాజిల్లా విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులో జగనన్న తోడుతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయకపోవడంపై లబ్దిదారులు ఆక్రోశం వ్యక్తం చేశారు. స్ధానిక వైసీపీ నేతల ప్రోద్భలంతో ఈ మూడు చోట్ల మున్సిపల్ కార్మికులు బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ చేసి నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం, సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉయ్యూరులో చెత్త ఘటనకు బాధ్యుడిని చేస్తూ నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ ప్రకాశరావును సస్పెండ్ చేశారు.

కమిషనర్‌పై అభియోగాలు
ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ ఘటనపై సీరియస్ అయిన సర్కారు మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించారు. ఆయన ఉయ్యూరులో విచారణ నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో ఉయ్యూరులో నాలుగు జాతీయ బ్యాంకుల ముందు చెత్త వేసినట్లు నిర్ధారించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా చెత్త డంపింగ్ చేయించినట్లు కమిషనర్‌పై అభియోగాలు మోపారు. రుణాలు ఇవ్వలేదనే ఆక్రోశంతోనే చెత్త వేయించి ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉంటూ ఉయ్యూరు కమిషనర్‌గా ప్రకాశరావు పనిచేస్తున్నారు.

విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లకు నోటీసులు
బ్యాంకుల ముందు చెత్త వేయించిన వ్యవహారంలో విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్లనూ ప్రభుత్వం వివరణ కోరింది. బ్యాంకుల ముందు చెత్త వేయించిన ఘటనలో కమిషనర్ల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఉయ్యూరు తరహాలోనే అభియోగాలు నిర్ధారణ అయితే విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లపైనా చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. చెత్త ఘటనలపై వీరి నుంచి ఇవాళ, రేపట్లో వివరణ ప్రభుత్వానికి అందనుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలు ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉందనే సంకేతాలు పంపుతోంది.

సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా కారకులపైనా..
కృష్ణాజిల్లా విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులో రుణాలివ్వని బ్యాంకుల ముందు చెత్త వేయించిన ఘటనల్లో సీసీ ఫుటేజ్ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. చెత్త డంపింగ్ చేసిన వారెవరు, ఏయే సమయాల్లో ఈ చెత్త డంపింగ్ జరిగింది, ఏయే వాహనాల్లో చెత్తను తీసుకొచ్చి డంప్ చేశారనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో పురపాలక శాఖ ఉద్యోగులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాత్రను నిర్ధారించేందుకు ప్రభుత్వం సీసీ ఫుటేజ్ సేకరిస్తోంది. సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైతే దాని ఆధారంగా ఉద్యోగులు, సిబ్బందిపైనా క్రమశిక్షణా చర్యలకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.