కరువు సంగతి పక్కనబెట్టి దుబాయ్ యాత్రలా..! : సొంత పార్టీ నేతలపై జగన్ ఫైర్
కడప : వైసీపీ అధినేత జగన్ కడప జిల్లాలోని కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. జగన్ కడప జిల్లా పర్యటన సందర్భంగా.. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత విదేశీ పర్యటనలకు సంబంధించిన విషయాన్ని జగన్ దగ్గర ప్రస్తావించడమే ఇందుకు కారణమంటున్నారు పలువురు.
సదరు నేతలు అమెరికా, దుబాయ్ లలో త్వరలో తమ టూర్ ఉండబోతోందని అధినేత జగన్ కు తెలియజేయడంతో, రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాల్సిన సమయంలో ఇలాంటి టూర్స్ ఏంటని మండిపడ్డారట జగన్. ఓవైపు కరువుతో జనం అల్లాడుతుంటే, పార్టీ నేతలు విదేశీ పర్యటనలను ముందేసుకోవడం సబబు కాదని సూచించారట.
అయితే, కొద్దిరోజుల క్రితం చంద్రబాబు విదేశీ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు విదేశీ యాత్రలు చేస్తున్నారంటూ ఆ సమయంలో పలువురు వైసీపీనేతలు ఆరోపించారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల విదేశీ యాత్రలపై కూడా అధికార పక్షం విమర్శలకు దిగే అవకాశం ఉండడంతో అలాంటివేమి పెట్టుకోవద్దని చెప్పారట జగన్.

ఇకపోతే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై స్పందించేందుకు పలు వరుస కార్యక్రమాలతో జగన్ జనంలోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుంటూరులో మట్టిపెళ్లలు విరిగిపడి మృతి చెందిన కార్మికుల కుటుంబాలను మే 27న పరామర్శించనున్నారు. ఈ పర్యటన తర్వాత పోలవరం ముంపు గ్రామాల సమస్యలపై స్పందించేందుకు జూన్ 1, 2 తేదీల్లో ముంపు మండలాల్లో పర్యటించనున్నారు.
ముంపు మండలాల పర్యటన అనంతరం, జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో, అటు తర్వాత 6వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications