కార్యాలయంలోనే మహిళలపై లైంగిక వేధింపులు, డిఎస్పీ, ఎస్ ఐల పై వేటు
జమ్మలమడుగు: ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఓ డిఎస్ పి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో వేటు పడింది.ఈ ఆరోపణలు వెలుగుచూడడంతో వీఆర్ కు పంపారు జిల్లా ఎస్ పి రామకృష్ణ.కడప జిల్లా జమ్మల మడుగు డిఎస్పీ తన డ్రైవర్ ను అడ్డుపెట్టుకొని అమ్మాయిలను ఏకంగా తన కార్యాలయానికి రప్పించుకొని లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను వీఆర్ కు పంపారు ఎస్ పి.
తన కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులను రాత్రి పదిగంటలు దాటిన తర్వాత రమ్మనేవారనే ప్రచారం కూడ ఉంది.అయితే మరో వైపు ఇదే డివిజన్ పరిధిలోని ఓ ఎస్ ఐ పై కూడ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి.దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు.ప్రొద్దుటూరు రూరల్ ఎస్ ఐ జీఎండి బాషా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఏడాది మార్చి 5వ, తేదిన న్యాయం కోసం వచ్చిన ఓ మహిళను రాత్రిపూట లాడ్జీకి పిలిపించుకొని బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకొన్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలతో ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ ఎస్ ఐ భాషాపై సస్పెన్షన్ వేటు వేశారు.
కడప జిల్లాలోని మైదుకూరు డీఎస్పీ ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీపడినందుకు రెండు మాసాల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. మొత్తానికి ఒకే రోజు ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.
అసాంఘిక చర్యలకు పాల్పడే అదికారులపై చర్యలు తప్పవనే సంకేతాలను ఇచ్చారు ఎస్పీ రామకృష్ణ. దీంతో అక్రమాలకు పాల్పడే అధికారుల గుండెళ్ళో రైళ్లు పరిగెడుతున్నాయి.