బీహార్‌లో బీజేపీ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -ఆ ముగ్గురికి జనసేనాని విషెస్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కల్యాణ్ దేశ రాజకీయ పరిణామాలపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపునకు కారణాలు చెబుతూ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన జనసేనాని.. బుధవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ వెలువరించారు.
కమల భర్త ఎమోషనల్ పోస్ట్ -50ఏళ్ల వయసులో పెళ్లి -బ్రాహ్మణ-యూదు కాంబో -అభాండాలు

ఇదీ జరిగింది..
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి బుధవారం ఉదయానికల్లా పూర్తిస్థాయి ఫలితాలు అధికారికంగా వెలువడ్డాయి. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ తో ఉపాధి కరువు, వలస కూలీల వెతలు, ఆర్థిక వ్యవస్థ పతనం, వైరస్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాల వైఫల్యం.. తదితర అడ్డంకులను అధిగమించి మరీ బీహార్ లో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగరేసింది. 74 సీట్లతో బీజేపీ ఎన్డీఏలో సీనియర్ భాగస్వమిగా అవతరించగా, సీఎం నితీశ్ చీఫ్ గా ఉన్న జేడీయూ 43 సీట్లకు పడిపోయింది. మొత్తం 125 స్థానాలు సాధించిన ఎన్డీఏ అధికారాన్ని నెలబెట్టుకోగా, మహాకూటమి 110 సీట్లకే పరిమితం అయింది. ఈ ఫలితాలపై పవన్ ఏమన్నారంటే..
బీహార్ షాక్: విజేతలుగా మోదీ-తేజస్వీ -సీఎం నితీశ్ భారీ మూల్యం -అద్వానీ 30ఏళ్ల కల నెరవేరేలా..

నమ్మకానికి నిదర్శనం..
‘‘బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), ఎన్డీఏ కూటమి సాధించిన విజయం.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. బీహార్ లో సుదీర్ఘ కాలంగా పాలన చేస్తోన్న ఎన్డీఏ కూటమి.. మరో మారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనింది. తెలంగాణలోని దుబ్బాకతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఎక్కువ స్థానాలు పొందడానికి స్పష్టమైన కారణాలున్నాయి. అవి..

ఆత్మనిర్భర్ కీలకం..
జాతీయవాద దృక్ఫథంతో, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రధాని మోదీ చేపడుతోన్న కార్యక్రమాలు బీజేపీ గెలుపులో కీలక అంశాలుగా నిలిచాయి. దేశ ఆర్థిక స్థితిని మెరుగుపర్చి, ఉపాధి అవకాశాలను పెంచేందు కోసం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ తోపాటు రైతులు, చిరు వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూపొందించిన పథకాలు సగటు బీహారీ ఓటర్లను ఆలోచింపజేశాయి. అంతేకాదు..

నవతరం ఓటర్ల ఆకర్షణ..
దేశ సమైక్యత కోసం, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇనుమడింపజేయడంలో మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రణాళికాబద్ధమైన విధానాలు నవతరం ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ముఖ్య కారకులైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు నా అభినందనలు'' అని జనసేనానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దక్షిణాదిలో బీజేపీ.. జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.