జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం ప్రత్యేక పాట విడుదల:ఇంకెన్ని గాయాలు
అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆ పార్టీ ఓ పాట విడుదల చేసింది. మహనీయుల త్యాగాలు నేటి తరానికి తెలిపేలాగా ఈ ప్రత్యేకపాటను రూపొందించింది.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ ఖాళీ ప్రాంగణంలో మార్చి 14 బుధవారం నాడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలిసింది. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని భావిస్తూ అందుకు తగిన స్ళాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక జనసేన ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానుల్లో స్ఫూర్తి నింపేలా ఒక ప్రత్యేక పాటను విడుదల చేసింది. 'ఇంకెన్ని గాయాలు' టైటిల్ తో రూపొందించిన ఈ వీడియో థీమ్ సాంగ్ కు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు.
''భారత్ మాతాకీ జై.. వందేమాతరం.. జై తెలంగాణ, జై ఆంధ్ర.... పోరాడి...పోరాడి తెచ్చారు స్వతంత్య్రం"...అంటూ సాగే ఈ గీతంలో "ఎన్నెన్నో త్యాగాలకు గుర్తే ఈ గణతంత్రం...ప్రళయాగ్నికి కాదా గాలి ఆయుధం. ఈ దేశానికి నీ రక్తమేగా ఔషధం"...అని దేశ భక్తిని రగిలించేలా పదాలు ప్రవాహంలా సాగుతూ..."గర్జించు నీలో ఆవేశాన్ని. గెలిపించరా న్యాయాన్నీ.. చూపించరా నీ జెండా పొగరునీ.. ఇంకెన్ని.. ఇంకెన్ని తూటాలు. ఇంకెన్ని గాయాలు.. ఇంకెన్ని ప్రాణాలు.. ఇంకెన్ని మోసాలు?..'' అంటూ అన్యాయాన్ని నిలదీసేలా...రూపొందించారు....అలాగే అమరవీరుల తల్లిదండ్రుల వేదనను బ్యాక్డ్రాప్లో వినిపించారు. పాట చివరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిక్కులు పిక్కటిల్లేలా...'భారత్ మాతాకీ' అని నినదిస్తుంటే...'జై' అంటూ కార్యకర్తలు ప్రతిస్పందిస్తూ ఉండటంతో వీడియో సాంగ్ ఎండ్ అవుతుంది.